: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, జగన్ ఎందుకు పోరాడరు?: రాహుల్ గాంధీ

ఏపీకి ప్రత్యేక హోదా గిఫ్ట్ కాదని, ఇక్కడి ప్రజల హక్కు అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ‘ప్రత్యేక హోదాకు భరోసా’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, విభజన జరిగినప్పుడు ఈ హోదా కల్పిస్తామని ఏపీకి హామీ ఇచ్చారని, ఏపీ అభివృద్ధికి కేంద్ర సాయం ఎంతో అవసరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటం లేదని ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను చంద్రబాబు, జగన్ లు  ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, జగన్ పోరాడకున్నా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని అధికార, ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయని, అందుకు కారణం వారికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీనే అని ఆరోపించారు. ప్రధాని మోదీ అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలకు భయమని, అందుకే వారు నోరు మెదపడం లేదని విమర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా హక్కుని కల్పించారని, దానిని సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్పా, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. నాడు తిరుపతి సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, దేవుడి సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ అన్నారు.

More Telugu News