: తెలంగాణ ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూసి ఓర్వ‌లేక పోతున్నారు!: చంద్ర‌బాబుపై ఎంపీ బాల్క సుమన్ నిప్పులు

జూన్ 2వ తేదీ ఇట‌లీ స్వాతంత్ర్య దినోత్సవం అని, ఏపీని అదే రోజున విడ‌గొట్టి ఆంధ్ర‌ ప్ర‌జ‌ల్ని రోడ్డున ప‌డేశార‌ని ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్నార‌ని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ అన్నారు. మార్చి 17 ఇట‌లీ స్వాతంత్ర్య దినోత్స‌వం అయితే, చంద్ర‌బాబు మాత్రం మ‌రో విధంగా మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఆంధ్ర‌ ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డానికే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ...  చంద్ర‌బాబు నాయుడు మీడియా సాక్షిగా, ప్ర‌జ‌ల సాక్షిగా ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు తెలంగాణ ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూసి ఓర్వ‌లేక పోతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో ఆనందంగా చేసుకుంటోంటే, చంద్ర‌బాబు ఈ రోజుని ఓ చీక‌టి రోజుగా అభివ‌ర్ణిస్తున్నారని బాల్క సుమ‌న్ అన్నారు. తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఏపీలో క‌లిపేవ‌ర‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోమ‌ని మోదీతో అన్నాన‌ని చంద్ర‌బాబు నాయుడే చెప్పారని అన్నారు. చంద్ర‌బాబు తెలంగాణ‌పై ఇటువంటి కుళ్లును క‌డుపులో బాగా పెట్టుకున్నార‌ని ఆయ‌న అన్నారు. హైదరాబాదుకు వ‌చ్చినప్పుడు ఇక్క‌డే ఉంటే బాగుంటుందని మాట్లాడుతున్నారని, ఏపీకి వెళ్లి మ‌రోలా మాట్లాడుతున్నార‌ని బాల్క‌సుమ‌న్ విమర్శించారు. ఇటువంటి ఊస‌ర‌వెల్లి మాట‌లు మాట్లాడ‌కూడ‌దని హిత‌వు ప‌లికారు.

టీటీడీపీ నేత‌ల‌కు చీము, నెత్తురు ఉంటే ఆ పార్టీని వ‌దిలేయాల‌ని ఆయ‌న అన్నారు. ఎంత సేప‌టికి విభ‌జన అంశాన్నే ప‌ట్టుకుని చంద్ర‌బాబు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ‌ను కేసీఆర్ ఎలా ముందుకు తీసుకువెళుతున్నారో, అలా ఏపీని తీసుకెళ్లే స‌త్తాలేకే చంద్ర‌బాబు ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి ఆంధ్ర‌ప్ర‌జ‌ల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నార‌ని అన్నారు. చంద్ర‌బాబు తెలంగాణ‌ను చూసి క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. టీటీడీపీ నేత‌లు చంద్ర‌బాబు నాయుడి ద‌గ్గ‌ర బానిస‌లుగా ప‌డి ఉండ‌కూడదని అన్నారు.

More Telugu News