: అధికారులు తీసుకున్న లంచం డబ్బును వెనక్కు ఇప్పించాను: చంద్రబాబు

తమ పని కోసం ఎవరికైనా లంచాలు ఇస్తే, దాన్ని తిరిగి వారికే ఇప్పించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టినట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన 'పరిష్కార వేదిక' కాల్ సెంటరుకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారించి, లంచం తీసుకున్న మాట వాస్తవమే అయితే, వాటిని తిరిగి వెనక్కు ఇచ్చేయాలని ఆదేశాలు ఇస్తున్నామని, ఇప్పటివరకూ 12 మంది నుంచి లంచాలు తిరిగి ఇప్పించామని చంద్రబాబు తెలిపారు. లంచాలు తీసుకున్న వారి పేర్లను మాత్రం వెల్లడించకుండా, పెన్షన్ల మంజూరుపై 1.20 లక్షలకు పైగా కాల్స్ వస్తే, అందులో 4 శాతం, రేషన్ కు సంబంధించి  లక్షల కాల్స్ వస్తే, 1.25 శాతం అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

కడప జిల్లాలో చంద్రన్న బీమా పథకం కోసం లబ్దిదారు నుంచి రూ. 1000 లంచం తీసుకున్నాడని ఫిర్యాదు వచ్చిందని, విచారించి దాన్ని తిరిగి వెనక్కు ఇప్పించామని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో పెన్షన్ మంజూరు చేయించేందుకు ఓ పంచాయితీ కార్యదర్శి రూ. 500 తీసుకోగా, అతన్ని హెచ్చరించామని, ఆపై పది మంది నుంచి తాను తీసుకున్న డబ్బులను అతను వెనక్కు ఇచ్చేశాడని పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతినీ సహించబోనని, ఈ విషయంలో ప్రజలు తమకందే సమాచారాన్ని '1100' నంబరుకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News