: కాంట్రావర్సీ: అల్లు అర్జున్ 'డీజే' సినిమా పాటపై బ్రాహ్మణ సేవాసమితి తీవ్ర అభ్యంతరం.. వార్నింగ్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'దువ్వాడ జగన్నాథమ్‌' (డీజే) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఒక పాటపై వివాదం రేగింది. ఈ సినిమాలో గుడిలో, మడిలో, బడిలో, ఒడిలో అంటూ సాగే పాటపై బ్రాహ్మణ సేవా సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పాటలోని కొన్ని పదాలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. రుషులను కించపరిచేలా ఉన్న పాటను వెంటనే నిలుపుదల చేయాలని సెన్సార్‌ బోర్డుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.

 ‘డీజే’ సినిమాలోని సాహితి రాసిన ‘‘అస్మైక యోగ తస్మైక భోగ’’ పాటలో.. ‘‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’’ అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రుద్ర శ్లోకంలోని పదాలను శృంగారపరమైన భావాన్ని వ్యక్తీకరించడం తప్పు అని వారు చెబుతున్నారు. అలాగే రుషిపరంపరను, గోత్రనామాలను తెలిపే ‘ప్రవర’లో ప్రణయ మంత్రాలుంటాయనడం అపచారమని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా ‘‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’’ అనే లైన్ తమను అవమానించడమేనని వారు స్పష్టం చేస్తున్నారు. దీనిపై రచయిత సాహితి మాట్లాడుతూ, హీరో బ్రాహ్మణ యువకుడని, తనకు తెలిసిన భాష, పదాలను వాడుతాడని, అందులో తప్పేంటో తనకు అర్థం కావడం లేదని అన్నాడు.

More Telugu News