: తెలంగాణ ఆవిర్భవించిన రోజునే నవనిర్మాణ దీక్ష: చరిత్ర ఉన్నంత వరకూ కొనసాగుతుందన్న చంద్రబాబు

చరిత్ర ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2నే నవనిర్మాణ దీక్ష జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఇతర అధికారులతో భేటీ అయిన చంద్రబాబు, నవనిర్మాణ దీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష జరుపుకోవాలని, ఇది ఎవరినో నిందించేందుకు మాత్రం కాదని తేల్చి చెప్పారు.

అదే విధంగా 8న మహా సంకల్పం చెప్పుకోవాలని, గడచిన మూడేళ్లలో సాధించిన ప్రగతిపై 3 నుంచి చర్చలు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో సగటు ఆదాయం తక్కువగా ఉండటానికి కారణం ఏమిటన్న విషయం ఆలోచించాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సింది మంత్రులు, పార్టీ నేతలేనని అన్నారు. అధికారులు వినూత్నంగా ఆలోచించి, మూస ధోరణిని విడనాడాలని, అప్పుడే ప్రగతి సాధ్యపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షల్లో థర్డ్ ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసి గోపాలకృష్ణకు ఆయన అభినందనలు తెలిపారు.

More Telugu News