: రాత్రి బాగా పొద్దుపోయాక కూడా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా?.. అయితే మీకో బ్యాడ్ న్యూస్!

నిద్రపోవడానికి ముందు కూడా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి ఇది చేదు వార్త. రాత్రుళ్లు బాగా పొద్దుపోయాక కూడా ఫోన్‌ను ఉపయోగించడం వల్ల టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియాలోని ముర్దోక్ అండ్ గ్రిఫిత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్న కౌమార దశలో ఉన్న వారి మానసిక ఆరోగ్యంపై సుదీర్ఘకాలం పాటు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నాలుగేళ్ల పాటు 29 పాఠశాలలకు చెందిన 1,100 మంది విద్యార్థులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో నిద్రలో నాణ్యత, మానసిక స్థితి, కోపం, నైపుణ్యాలు, ఆత్మగౌరవం, డిప్రెషన్ తదితర వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

రాత్రి బాగా పొద్దుపోయాక కూడా ఫోన్‌ను ఉపయోగించడం వల్ల వారిలో నిద్రలేమి సమస్యతోపాటు మానసిక ఆరోగ్యంలోనూ తేడా వచ్చినట్టు అధ్యయానికి నేతృత్వం వహించిన లినెట్టి వెర్నన్ తెలిపారు. నాలుగేళ్ల తర్వాత అధ్యయనం ముగిసే నాటికి 78 శాతం మంది విద్యార్థులు నిద్రలేమి, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. నిద్రపోయే గదిలో నీలం రంగు కాంతి నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. హర్మోన్లు, మెలాటోనిన్, ఇన్సులిన్ స్రావాలపైనా ప్రభావం చూపిస్తుందని అధ్యయనకారులు తెలిపారు. దీనివల్ల శరీర సమతౌల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు టీవీ చూడడం, మొబైల్, ట్యాబ్లెట్ ఉపయోగించడం వల్ల స్లీప్ ప్యాటర్న్ (నిద్ర నమూనా) దెబ్బతింటుందని హెచ్చరించారు. బెడ్ రూంలో బ్లూ లైటే అతి పెద్ద సమస్య అని అధ్యయనకారులు పేర్కొన్నారు.

More Telugu News