: ఆల్ ఖైదా పగ్గాలు చేపట్టిన బిన్ లాడెన్ కుమారుడు హమ్జా.. ప్రపంచ దేశాల్లో కలవరం!

అగ్రరాజ్యం అమెరికాకే దడ పుట్టించిన ఉగ్రసంస్థ ఆల్ ఖైదాకు కొత్త వారసుడు వచ్చాడనే విషయాన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ (28) ఆల్ ఖైదా పగ్గాలు చేపట్టాడని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, వివిధ ఉగ్రవాద సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, తిరుగులేని శక్తిగా ఆల్ ఖైదాను తీర్చిదిద్దేందుకు హమ్జా ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ముప్పు ఉన్న దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఇప్పటికే నెత్తుటి ఏర్లు పారిస్తున్న ఐసిస్ ను అంతం చేయడం ఎలాగంటూ ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, మళ్లీ పుంజుకునేందుకు ఆల్ ఖైదా అడుగులు వేస్తుండటం... కలవరపరిచే అంశమే.

మరోవైపు, హమ్జా పిలుపిస్తే ఆ సంస్థలో చేరేందుకు వేలాది మంది ముస్లిం యువత సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒసామా బిన్ లాడెన్ మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందినవాడు కావడమే దీనికి కారణం. బిన్ లాడెన్ వారసుడు హమ్జానే అని గతంలోనే ఆల్ ఖైదాకు చెందిన నాయకులు తీర్మానించారు. ఆల్ ఖైదా కీలక నేత అల్ జవహరి అయితే... హమ్జాను ఏకంగా 'గుహ నుంచి వచ్చిన సింహం' అంటూ అభివర్ణించాడు. బిన్ లాడెన్ మూడో భార్య శైరియా సమర్ కుమారుడే హమ్జా. లాడెన్ కు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. హమ్జాకు వివాహం అయిందని... ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. హమ్జా ఎలా ఉంటాడనే విషయం ఎవరికీ తెలియదు. అతని చిన్ననాటి ఫొటో మాత్రమే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది.

More Telugu News