: కిడ్నాప్ అయిన మరిది కోసం తుపాకీ తీసుకుని ముందుకు దూకిన ఆయేషా ఫలాక్

ఆయేషా ఫలాక్... 2015లో షూటింగ్ లో గోల్డ్ మెడల్ విన్నర్. తుపాకీ పేల్చడంలో దిట్ట. కానీ ఈ సారి మాత్రం ఆమె ఏ టోర్నీ కోసమో కాకుండా, కిడ్నాప్ అయిన తన మరిదిని రక్షించుకునేందుకు లైసెన్డ్స్ రివాల్వర్ తీసుకుని సివంగిలా ముందుకు దూకింది. కిడ్నాపర్ల ప్రాణాలకు హాని కలుగకుండా రెండు తూటాలను పేల్చి మరిదిని కాపాడుకుంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 33 ఏళ్ల ఆయేషా ఫలాక్, గత ఆరేళ్లుగా షూటర్ గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఆమె మరిది ఆసిఫ్ ఫలాక్ ఓ టాక్సీ డ్రైవర్. ఇద్దరు వ్యక్తులు తమను పికప్ చేసుకోవాలని ఆన్ లైన్ లో బుక్ చేసుకోగా, ఆసిఫ్ వెళ్లాడు.

రాత్రి 10 గంటల సమయంలో టాక్సీ ఎక్కిన వారు, ఆపై హర్యానా సరిహద్దుల వరకూ వెళ్లి, అక్కడ ఆసిఫ్ ను బంధించారు. ఆపై ఆయేషా భర్త షీర్ అలామ్ కు ఫోన్ చేసి రూ. 25 వేలు డిమాండ్ చేశారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలాక్, ఆపై ఘటనా స్థలికి భార్యతో సహా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పోలీసుల వాహనం వెనక వస్తుండగా, ఈ జంట ముందు సాగింది. డబ్బు తీసుకు వస్తున్నామని చెప్పిన వీరు, తమ వెంట పాయింట్ 32 రివాల్వర్ ను కూడా తీసుకెళ్లారు. కిడ్నాపర్ల వద్దకు వెళ్లగానే, వారికి పోలీసులు కూడా వెనకే వస్తున్నట్టు తెలిసిపోయిందేమో, వీరిని చంపాలని పెద్దగా అరుస్తూ కారు దిగారు.

ఆ వెంటనే ఆయేషా తన తుపాకిని తీసి గురి తప్పకుండా నిందితుల కాళ్లపై కాల్పులు జరిపారు. వారు కుప్పకూలేలోగా పోలీసులు వచ్చి బంధించారు. కాల్పులు జరిపేందుకు తానేమీ భయపడలేదని, అమ్మాయిలకు తాను స్వీయ రక్షణ టెక్నిక్స్ నేర్పుతుంటానని ఆయేషా వెల్లడించింది. నిందితులను మొహమ్మద్ రఫీ, ఆకాష్ గా గుర్తించిన పోలీసులు, నిందితులకు ప్రాణహాని జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఆయేషా పై ప్రశంసల వర్షం కురిపించారు.

More Telugu News