: నిషిత్ నారాయణ కారు మెట్రో పిల్లర్ ను 146 కిలో మీటర్ల వేగంతో ఢీ కొంది...ఆ లెక్కలివే!

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు కామిని రాజారవిచంద్రలు ఈనెల 10న హైదరాబాదులోని జూబ్లిహిల్స్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును అంత్యంత నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కారు ప్రమాదం జరిగిన అనంతరం 210 కిలోమీటర్ల వేగంతో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసిన హైదరాబాదు పోలీసులు 146 కిలోమీటర్ల వేగంతో వారిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. అయితే ఢీకొట్టిన క్రమంలో వెంటనే ఎక్స్‌ లరేట్ అయి, కారు స్పీడో మీటర్ వేగం 200 నుంచి 210 మధ్య లాక్ అయిందని పేర్కొన్నారు.

సీసీ కెమెరాలలో రికార్డయిన దృశ్యాలలో కారు అతివేగంగా వెళ్లి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్నట్లు స్పష్టమైంది. ఈ సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా మెట్రో పిల్లర్ 9ని నిశిత్ కారు ఢీ కొట్టింది. పిల్లర్ నెం. 8 నుంచి 9 కి మధ్య దూరం 64 అడుగులు. పిల్లర్ల సైజ్ 11 అడుగులు. ఈ మొత్తం 75 అడుగుల దూరాన్ని నిషిత్ కారు కేవలం 0.56 సెకండ్లలోనే క్రాస్ చేసి ఢీ కొట్టింది. సీసీ కెమెరాలలో ప్రతి సెకన్‌ కు రికార్డయిన ఫీడ్‌ ను ఫొటోలుగా విభజిస్తే 24 ఫ్రేమ్స్ వస్తాయి. ఈ ప్రమాద ఘటనను విభజించగా 24 ఫ్రేమ్స్ రావాల్సి ఉండగా, కేవలం 4 ఫ్రేమ్స్ మాత్రమే వచ్చాయి. దీంతో ఈ ఫ్రేమ్స్ ఆధారంగా నిషిత్ కారు వేగాన్ని లెక్కగట్టారు. దీని ప్రకారం ప్రతి సెకెన్‌ కు 133 అడుగులు, నిమిషానికి 2.42 కిలోమీటర్లు, గంటకు 146 కిలోమీటర్ల వేగంతో కారు ప్రయాణించినట్లు ట్రాఫిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం తెలిపింది. కాగా, దీనిపై బెంజ్ కంపెనీ నిపుణులు కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంది. వారి నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. 

More Telugu News