: మళ్లీ రేసులోకొచ్చిన 'దంగల్'... 'బాహుబలి'తో 'ఢీ'... రికార్డులు 'దంగల్' వేనా?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్' సినిమా మరోసారి రేసులోకి వచ్చింది. అప్పటివరకు వున్న భారతీయ చిత్రపరిశ్రమ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టిన 'దంగల్'.. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఎంటర్ కావడంతో వెనుకపడింది. తెలుగు సినీ ప్రతిష్ఠను పెంచుతూ 1500 కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. 'దంగల్' భారత్ లో 744 కోట్ల రూపాయలు వసూలు చేయగా...'బాహుబలి-2: ద కన్ క్లూజన్' 1500 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో మే 5న చైనాలో విడుదలైన 'దంగల్' రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది.

కేవలం 17 రోజుల్లో 'దంగల్' చైనాలో 740 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా మళ్లీ రేసులోకి వచ్చింది. భారత్ చైనాల్లో కలిపి దంగల్ 1501 కోట్లు వసూలు చేయగా, 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా 1538 కోట్ల వసూళ్లు సాధించింది. చైనాలో అద్భుత విజయం సాధించిన దంగల్ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' వసూళ్లను దాటడం సులభమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చైనీయులకు గ్రాఫిక్ సినిమాలు పెద్ద విశేషం కాదు కానీ, ఎమోషన్స్ ఉన్న 'దంగల్' విజయం సాధించడంలో విశేషం లేదని పేర్కొంటున్నారు. కాగా, 'దంగల్' సినిమా క్రీడా ప్రాధాన్యం వున్న చిత్రం కావడం, చైనీయులకు మార్షల్ ఆర్ట్స్ అన్నా, క్రీడలన్నా ఇష్టం ఉండడంతో కలెక్షన్ల రేసులో 'దంగల్' తో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' పోటీ పడుతుందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News