: మా వద్ద 'ప్లాన్ ఏ' ఉంది... ఫెయిలైతే 'ప్లాన్ బి': పాకిస్థాన్ పై హరీష్ సాల్వే ఆసక్తికర వ్యాఖ్యలు

పాక్ చేతికి చిక్కి మరణశిక్షకు గురికాబడిన మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట పొందిన భారత్, ఇప్పుడు అతన్ని ఎలాగైనా భారత్ చేర్చాలని ఆలోచిస్తోంది. ఈ కేసులో ఇండియా తరఫున వాదనలను సమర్థవంతంగా వినిపించిన మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, 46 ఏళ్ల జాదవ్ ను విడిపించే విషయంలో తమ వద్ద రెండు ప్లాన్ లు ఉన్నాయని తెలిపారు. తొలుత ప్లాన్ 'ఏ'ను అమలు చేస్తామని, అది విఫలమైతే ప్లాన్ 'బీ'ని అమలు చేస్తామని తెలిపారు.

ప్లాన్ 'ఏ'లో భాగంగా, న్యాయమీమాంశను తెరపైకి తెచ్చి, తక్షణం జాదవ్ ను విడుదల చేయాలని పాకిస్థాన్ కు విజ్ఞప్తి చేస్తామని ఆయన అన్నారు. ఒకవేళ, ఈ మార్గంలో జాదవ్ విడుదల కుదరకుంటే, రెండో ప్రణాళిక అమలు చేస్తామని, అది దీర్ఘకాలం పాటు సాగుతుందని, పాకిస్థాన్ కోర్టుల్లోనే విషయాన్ని తేల్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. జాదవ్ నిర్దోషిత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించే వీలుండదని స్పష్టం చేసిన ఆయన, దాన్ని పాకిస్థాన్ కోర్టుల్లోనే నిరూపించాల్సి వుంటుందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉన్న పరిమితుల దృష్ట్యా, జాదవ్ ను ఇండియాకు అప్పగించాలన్న తీర్పు వచ్చే అవకాశాలుండవని తెలిపారు. ఏదిఏమైనా జాదవ్ ను తిరిగి ఇండియాకు తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తామని వెల్లడించారు.

More Telugu News