: నంద్యాల టికెట్ కోసం వైసీపీలో పోటీ.. జగన్ ఏం చేయబోతున్నారు?

నంద్యాల ఉపఎన్నిక టీడీపీలోనే కాదు, వైసీపీలో సైతం వేడిని పుట్టిస్తోంది. టీడీపీలో టికెట్ కోసం భూమా కుటుంబంతో పాటు శిల్పా మోహన్ రెడ్డి కూడా పోటీపడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీలో సైతం టికెట్ కోసం పోటీ నెలకొంది. పార్టీ ఇన్ ఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ తనకే వస్తుందనే భావనతో ఉన్నారు. ఆయన సన్నిహితులు, అనుచరులు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని ఘటన జరిగింది.

నంద్యాల మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ తో నిన్న భేటీ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దీంతో,  వైసీపీలో ప్రతాప్ రెడ్డి చేరిక ఖరారైందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఉప ఎన్నికలో గంగులను బరిలోకి దించేందుకు వైసీపీ సన్నాహకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు టికెట్ తనకే ఇస్తానని జగన్ తనకు మాట ఇచ్చారని... ఎన్నికల బరిలో తానే ఉంటానని మల్లిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో, టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ వైసీపీలో కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారనే టెన్షన్ పార్టీ శ్రేణులను వెంటాడుతోంది.

More Telugu News