: 'పొలిటికల్ పంచ్' రవికిరణ్ పై తొలి ఫిర్యాదు చేసింది వైకాపా నేతలే!: సాక్ష్యాలు చూపిన పరకాల

సోషల్ మీడియాలో అసభ్యంగా కార్టూన్ పోస్టులు పెడుతున్న ఇంటూరి రవికిరణ్ పై తొలుత ఫిర్యాదు చేసింది వైకాపా నేతలేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ మేరకు సాక్ష్యాలను చూపారు. విశాఖపట్నంలో రవికిరణ్ పై జూలై 31, 2014న వైకాపా కార్యకర్తలు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో విశాఖ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందని, అది నిజమా? కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను పరకాల వెల్లడించారు. ఆనాడు కూడా ఆయనపై భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదునే వైకాపా నేతలు చేశారని తెలిపారు. రవికిరణ్ అభ్యంతరకర పోస్టులు పెడుతున్నట్టు మూడేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన వైకాపా, ఇప్పుడు ఆయన్ను వెనకేసుకొచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నందునే రవికిరణ్ పై కేసులు పెట్టాల్సి వచ్చిందని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే ఎవరూ చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా చిత్రాలు, భాష వాడటం ఎంతమాత్రమూ సబబు కాదని పరకాల అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తమదేనని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక వేదికలపై తన వైఖరిని స్పష్టం చేశారని అన్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని తాము ఆహ్వానిస్తామని, ప్రజా ప్రతినిధుల పరువు తీసే పనులను ఎవరూ హర్షించరని హితవు పలికారు.

More Telugu News