: ట్రంప్ నిర్ణయంతో రోడ్డున పడనున్న ఐటీ నిపుణుల సంఖ్య 56,000

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం భారత్ లో తీవ్రంగా చూపిస్తుందన్న సంగతి తెలిసిందే. 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' నినాదంతో దూసుకెళ్లిన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 56,000 ఇండియన్ టెక్కీలు రోడ్డున పడనున్నారని ఏడు విభాగాల మానవనరుల విభాగాధిపతులు తెలిపారు. ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌ (భారతీయ కంపెనీలు), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ, క్యాప్‌ జెమినీ సంస్థలన్నింటిలో కలిపి దాదాపు 12,40,000 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 శాతం అంటే దాదాపు 56 వేల మంది ఉద్యోగులపై ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఈ 56 వేల మందిని తొలగించేందుకు ఆయా సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

 అంతే కాకుండా కొత్త ఉద్యోగుల నియామకంలోనూ ఆచి తూచి వ్యవహరించనున్నాయి. భారత్ లో ఇంత భారీ ఎత్తున ఐటీ నిపుణులను తొలగించడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు. ఇందుకోసం ఉద్యోగుల పనితీరును తక్కువ చేసి చూపడంతో పాటు, కనిష్ట రేటింగ్స్ ఇస్తున్నారని వారు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో 5 నుంచి 8 ఏళ్ల అనుభవం కలిగిన ఐటీ నిపుణులపై వేటు పడనున్నట్టు వారు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఐటీ పరిశ్రమలో రాజభోగాలు అనుభవించిన వారు... రోడ్డున పడితే జీవితాలు తల్లకిందులవుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. దీనితో పాటు కాస్ట్ కటింగ్ కు కూడా ఐటీ పరిశ్రమ మొగ్గుచూపుతోందని. వివిధ సౌకర్యాలను కూడా తగ్గించుకుంటోందని వారు వెల్లడించారు.

More Telugu News