: నిర్భయ నిందితులకు ఉరిశిక్షే సరైంది!: సుప్రీంకోర్టు తీర్పు

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. దిగువ కోర్టుల తీర్పును సమర్ధిస్తూ దోషులు ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ ల అప్పీళ్లను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ, వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. నలుగురు దోషులకూ ఉరిశిక్షే సరైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పును జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం వెలువరించింది.

 కాగా, 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో కదిలే బస్సులో ఇరవై మూడేళ్ల యువతి ‘నిర్భయ’పై దోషులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ట్రయిల్ కోర్టు వీరికి మరణశిక్షను విధించగా, హైకోర్టు కూడా దానినే సమర్థించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది. ఇదిలా ఉండగా, ఈ కేసులో ఉరిశిక్ష పడ్డ దోషుల ముందు మరో రెండు మార్గాలు ఉన్నాయి. త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని అభ్యర్థిస్తూ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం వుంది. అప్పటికీ, తీర్పు వారికి అనుకూలంగా రాకపోతే క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని అభ్యర్థించే వీలుంది.

More Telugu News