: భక్తులతో కిక్కిరిసిన తిరుమల... గదులు లేవు, దర్శనానికి 15 గంటలు

తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. అసలే వేసవి సెలవులు, పైగా వారాంతానికి తోడు సోమవారం మేడే సెలవు ఉండటంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా గదుల కోసం కౌంటర్ల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. నిన్న మధ్యాహ్నం నుంచే గదులు ఖాళీలేవన్న బోర్డులు వెలిశాయి. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. నిన్న రికార్డు స్థాయిలో 95 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది.

మరోవైపు వివాహ ముహూర్తాలూ కొనసాగుతుండటంతో, నూతన వధూవరులు, పెళ్లి బృందాలతో కల్యాణ మండపాల్లో సందడి నెలకొంది. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండడంతో బస్సుల కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ రద్దీ మంగళవారం వరకు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, నేడు త్యాగరాజస్వామి జయంత్యుత్సవం సందర్భంగా, బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి దర్శనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని, క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని వారికి అన్న పానీయాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News