: దినకరన్ కేసులో మరో వికెట్ పడింది... మరో బ్రోకర్ ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు!

జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలతో అరెస్టైన అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ కేసులో మరో వికెట్ పడింది. అన్నాడీఎంకే పార్టీ అధికారిక రెండాకుల గుర్తు తమకు దక్కేలా చేయాలంటూ ఎన్నికల సంఘం అధికారులకు 50 కోట్ల రూపాయలు ఇవ్వజూపారన్న ఆరోపణలపై బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖరన్ వాంగ్మూలం మేర దినకరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాలతో ఐదు రోజుల విచారణకు దినకరన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగాన్ని పెంచారు.

ఈ క్రమంలో ఢిల్లీ నుంచి దినకరన్ ను చెన్నై తీసుకెళ్లిన పోలీసులు దినకరన్ భార్యను ప్రశ్నించారు. ఈ సందర్భంగా చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వజూపారన్న సాక్ష్యాలు సేకరించారు. దీంతో దినకరన్ ను తీసుకుని ఢిల్లీ పోలీసులు బెంగళూరు బయల్దేరారు. అక్కడ పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళను కూడా విచారించనున్నారు. ఇదిలా ఉంచితే, మరోపక్క సుఖేష్ చంద్రశేఖరన్ కు 10 కోట్ల రూపాయలు అందజేసిన హవాలా ఏజెంట్ నరేష్ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్ లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన నరేష్ ను డిల్లీ పోలీసులు, ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News