: రూ. 10 వేలతో విమాన ప్రయాణం, గంటలో వెంకన్న దర్శనం... తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజ్

హైదరాబాద్ నుంచి తిరుమలకు విమానంలో తీసుకెళ్లి, అక్కడ గంట వ్యవధిలో దర్శనం చేయించి, చుట్టు పక్కల దేవాలయాలను చూపించి, తిరిగి రాత్రికి హైదరాబాద్ చేర్చేలా తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వేసవిలో పర్యాటకాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్న టూరిజం శాఖ రూ. 10 వేలతో ఒక రోజు, రూ. 13 వేలతో రెండు రోజుల ప్యాకేజీలను ప్రకటించింది. ప్రయాణం, దర్శనం, భోజనం, వసతి అన్నీ ఈ ధరలో ఇమిడి ఉంటాయి.

 ఒక రోజు యాత్రలో భాగంగా ఉదయం 6:55కు విమానంలో బయలుదేరి 8:10కి రేణిగుంటకు, అక్కడి నుంచి 9:30కు తిరుమల చేరుకునే యాత్రికులకు, ఉదయం 12:30 గంటల్లోపు దర్శనం, 3 గంటల వరకూ భోజనం, విశ్రాంతి, ఆపై తిరుచానూరు అమ్మవారి దర్శనం, సాయంత్రం 5:35 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి, రాత్రి 7:45కు హైదరాబాద్ చేర్చేలా ప్యాకేజీ ఉంటుంది.

రెండు రోజుల ప్యాకేజీలో భాగంగా, తొలుత శ్రీకాళహస్తి, ఆపై భోజన విరామం, సాయంత్రం కాణిపాకం లేదా తిరుచానూరు, రాత్రికి ఫార్చ్యూన్ కేన్సస్ లో బస, మరుసటి రోజు తిరుమల శ్రీవారి దర్శనం, ఆపై విశ్రాంతి, సాయంత్రం తిరుచానూరు అమ్మవారి దర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటాయి. ఇక ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి పర్యటనకు వెళ్లాలనుకునే వారు టీఎస్‌ టీడీసీ సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

More Telugu News