: ‘అప్పడం’ కోసమే చంపేశారు!.. రిక్షా కార్మికుడి హత్యకేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాదులోని సైదాబాద్‌లో ఈ నెల 16న జరిగిన రిక్షా కార్మికుడు అలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పడం కోసం జరిగిన గొడవే హత్యకు కారణమని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. భవానీనగర్ తలాబ్‌కట్ట అమన్‌నగర్‌కు చెందిన రిక్షా కార్మికుడు సయ్యద్ ఒమెద్ అలీ (45), అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ మిస్కీన్ (42), మాదన్నపేటకు చెందిన పంజాబీ శివకుమార్ అలియాస్ సంజయ్ (23) స్నేహితులు.

ఈ నెల 16న ముగ్గురు కలిసి సరూర్‌నగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగుతుండగా అప్పడం కోసం ముగ్గురి మధ్య గొడవ జరిగింది. స్నేహితులను అలీ దుర్భాషలాడాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న స్నేహితులు అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఎర్రగుంట శ్మశానవాటిక ఆవరణలో స్క్రాప్ ఉందని, దానిని తీసుకెళ్లి అమ్ముకుందామని చెప్పి అలీని తీసుకుని ఆటోలో శ్మశాన వాటికకు చేరుకున్నారు. ఆటోను రోడ్డుపైనే ఆపి అలీని శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి దాడి చేశారు. బండరాయితో తలపై మోదారు. దీంతో అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసును ఛేదించిన పోలీసులు శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News