: స్నాప్ చాట్ కు చుక్కలు చూపిస్తున్న ఇండియన్లు.. 'భారతీయులకు కృతజ్ఞతలు' అంటూ కొత్తపల్లవి

స్నాప్‌ చాట్‌ భారత్‌, స్పెయిన్‌ వంటి పేదదేశాల కోసం కాదని, ప్రీమియం కస్టమర్లపై దృష్టిపెట్టాలని సంస్థ సీఈవో స్పైగల్‌ చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సరైన సమాధానం చెబుతున్నారు. దీంతో నిన్నటి వరకు స్పైగల్ ను వెనకేసుకువచ్చిన ఆ సంస్థ ఇప్పుడు నెమ్మదిగా స్వరం మారుస్తోంది. స్నాప్‌ చాట్‌ అందరి కోసం ఉద్దేశించిందని, తమ సంస్థ భారతీయులకు ఎంతో రుణపడి ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. స్నాప్ చాట్ లో ఇంత మార్పుకి కారణం ఏంటంటే....భారత్ పై తీవ్ర వ్యాఖ్యల అనంతరం వేల సంఖ్యలో ఈ యాప్‌ ను భారతీయులు అన్‌ ఇన్‌ స్టాల్‌ చేస్తున్నారు.

ప్లేస్టోర్‌ లోని రివ్యూల్లో భారతీయులు స్పైగల్‌ ను దుయ్యబడుతున్నారు. ఈ మధ్య కాలంలో పోస్టు అయిన ప్లేస్టోర్‌ లో రివ్యూల్లో చాలావరకు స్పైగల్‌ తీరును, అతని వ్యాఖ్యలను తప్పుపడుతూనే సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నారు. దీంతో ఈ రేటింగ్ ప్రభావం కొత్త డౌన్‌ లోడ్లపై పడుతోంది. దీంతో స్నాప్ చాట్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు యూజర్లు వెనకడుగు వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి 1,92,906 ఉన్న సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ లు, మంగళవారం ఉదయానికి 15,02,203కు చేరాయి. యూజర్లు వీటికి సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తున్నా...ఇవి 4 స్టార్‌ రేటింగ్‌ కు దాదాపు సమానం.

 దీంతో స్నాప్ చాట్ కు వినియోగదారులు పడిపోతున్నారు. అంతే కాకుండా ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ తో 'బ్యాన్ స్నాప్ చాట్' పేరుతో ప్రచారం నడుస్తోంది. దీంతో స్నాప్ చాట్ దిమ్మదిరిగిపోతోంది. దీనికి తోడు గోరుచుట్టుపై రోకటి పోటులా...ఐఎన్‌సీ షేర్లు అమెరికా మార్కెట్లలో కుంగుతున్నాయి. ఒక్క సోమవారమే ఈ షేర్‌ విలువ 1.5 శాతం పడిపోయింది. దీంతో ఈ నెలలో ఈ షేర్లు కనిష్ట విలువను నమోదు చేశాయి. త్వరలో 3.4 బిలియన్‌ డాలర్ల విలువైన పబ్లిక్‌ లిస్టింగ్‌ కు రావాలని భావించిన ఈ సంస్థ ఆశలపై ఈ పరిణామాలన్నీ నీళ్లు జల్లుతున్నాయి. దీంతో అప్రమత్తమైన స్నాప్ చాట్ భారతీయులకు కృతజ్ఞతలని, తమది గ్లోబల్ సంస్థ అని కొత్తరాగం అందుకుంటోంది. 

More Telugu News