: టీడీపీకి ఎదురుదెబ్బలు... కాకతాళీయమే అయినా మొన్న భూమా, నేడు దేవినేని!

2019లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ, ఇతర పార్టీల్లోని పేరున్న నేతలను ఆకర్షించి, వారిని తెలుగుదేశంలో చేర్చుకున్నప్పటికీ వారిలో కొందరు తమ వంతు సేవలను పార్టీకి అందించకుండానే దూరమయ్యారు. మొన్నటికి మొన్న వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన నంద్యాల ఎమ్మెల్యే, కర్నూలు జిల్లాలో కీలక నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతిచెందగా, నేడు విజయవాడలో కీలక నేత, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన దేవినేని నెహ్రూ అదే గుండెపోటు కారణంగా మరణించడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటే.

1980 దశకం ఆరంభంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన సమయంలో ఈ ఇద్దరు నేతలూ యువకులే. యువతకు పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఎన్టీఆర్ నుంచి ప్రోత్సాహాన్ని అందుకుని రాజకీయంగా ఎదిగిన వారే. అనంతర పరిణామాల క్రమంలో వేరే పార్టీలను ఆశ్రయించినప్పటికీ, అటు భూమా నాగిరెడ్డి, ఇటు దేవినేని నెహ్రూ తమ చివరి రోజులను తెలుగుదేశంలోనే గడిపారు. వీరిద్దరి మరణం కర్నూలు జిల్లాలో, కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ కిందే లెక్క. వారు లేని లోటు పూడ్చలేనిదని స్వయంగా చంద్రబాబు నాయుడే వ్యాఖ్యానించారంటే, వారి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కాకతాళీయమే అయినా, వారాల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలను గుండెపోటు బలితీసుకోవడంతో కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు.

కాగా, ఈ ఉదయం మరణించిన దేవినేని నెహ్రూ మృతదేహం విజయవాడకు చేరుకుంది. నేతలు అభిమానుల నివాళుల తరువాత, రేపు ఆయన అంత్యక్రియలు చేయనున్నట్టు దేవినేని అవినాష్ ప్రకటించారు.

More Telugu News