: సైన్యం దాష్టీకాలేనా?... కాశ్మీర్ యువతను కొడుతూ పాక్ వ్యతిరేక నినాదాలు చేయించిన వీడియోలు బయటకు!

జమ్మూ కాశ్మీర్ యువతపై భారత సైన్యం దాష్టీకాలకు పాల్పడుతోందని చెబుతూ, రెండు వివాదాస్పద వీడియోలు బయటకు వచ్చి కలకలం రేపుతున్నాయి. ఈ వీడియోల్లో ఒకదానిలో పుల్వామాలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని నలుగురు సైనికులు నేలపై పడేసి బెత్తంతో కొడుతూ, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయించిన దృశ్యాలు ఉన్నాయి. మరో వీడియోలో ముగ్గురిని ఓ జీపులో కుక్కించి 'పాకిస్థాన్ ముర్దాబాద్' అని వారితో బలవంతంగా నినాదాలు చేయించారు.

మీకు స్వాతంత్ర్యం కావాలా? అంటూ ఓ జవాన్ యువకుడి ముఖంపై కొట్టగా, రక్తం కారినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉపఎన్నికల వేళ, ఓ యువకుడిని ఆర్మీ జీపు ముందువైపు కట్టేయడం, మరో ఆందోళనకారుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపిన వీడియోలు సంచలనం కలిగించగా, తాజాగా ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సీఎం మెహబూబా ముఫ్తీ వివరణ కోరగా, సైన్యం సైతం అంతర్గత విచారణ ప్రారంభించినట్టు తెలిపింది.

More Telugu News