: క్రెడిట్ కార్డు మోసంపై విచారిస్తే, బ్యాంకు డేటా విక్రయం కుంభకోణం వెలుగులోకి!

తన క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.46 లక్షలు దొంగతనం చేశారని సుశీల్ చంద్ర రస్తోగి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై జరిపిన విచారణలో బ్యాంకుల డొల్లతనం, ఖాతాదారులకు భద్రత కరవైందని నిరూపిస్తూ, భారీ డేటా విక్రయ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ రోమిల్ బానియా వెల్లడించిన వివరాల ప్రకారం, తన కార్డు నుంచి పేయూ, పేటీఎం, ఓలా క్యాబ్స్, మోబీ క్విక్, వోడాఫోన్ తదితర పేమెంట్ మర్చంట్స్ కు చెల్లింపులు జరుగుతున్నాయని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 4వ తేదీన జహంగిపురికి చెందిన ఆశిష్ కుమార్ ఝాను అరెస్ట్ చేసి విచారించారు. ఆపై అసలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

బ్యాంకు ఉద్యోగుతో డీల్స్ కుదుర్చుకోవడం, కాల్ సెంటర్లు, ఆథరైజ్డ్ సంస్థల నుంచి బ్యాంకు కస్టమర్ల డేటాను తస్కరించి, దాన్ని అమ్మకాలకు పెడుతున్న స్కామ్ ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 20 గిగాబైట్ల సమాచారాన్ని వీరి నుంచి రికవరీ చేయగా, వీటిల్లో కస్టమర్ పేరు నుంచి కార్డు నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలన్నీ ఉన్నాయి. ఒక్కో ఖాతాదారుడి వివరాలను కేవలం 10, 20 పైసలకు విక్రయిస్తున్నారు. తాము పాండవ నగర్ ప్రాంతానికి చెందిన పూరణ్ గుప్తాను అరెస్ట్ చేశామని, అతని వద్ద ముంబై సప్లయింగ్ సంస్థ నుంచి కొన్న 50 వేల మంది డేటా ఉందని పోలీసులు తెలిపారు. డేటాను అమ్మితే, సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆలోచించి, 2010లో కంపెనీని పెట్టాడని తెలిపారు. ఈ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని, మరింత మందిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

More Telugu News