: రంగంలోకి దిగిన 'పింక్ హోయ్సళ'... బెంగళూరు రోమియోలకు చెక్!

ఆకతాయిలకు అడ్డుకట్ట వేసి, యువతులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కన్నడ సర్కారు ప్రారంభించిన 'పింక్ హోయ్సళ' తన పనిని ప్రారంభించింది. ఆపదలో ఉన్న మహిళలను రక్షించడం, రోమియోల పనిబట్టడమే ఈ బృందం ప్రధాన కర్తవ్యం. ఓ అమ్మాయిని తన బైక్ ఎక్కాలంటూ వేధిస్తున్న దీపక్ అనే యువకుడిని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పింక్ హోయ్సళ టీమ్ అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్ల క్రితం వరకూ ఓ యువతిని ప్రేమించిన దీపక్, ఆపై ఆమె తనను నిర్లక్ష్యం చేస్తోందని భావించి వేధింపులకు దిగాడు.

ఈ క్రమంలో ఆమె రోడ్డుపై వెళుతుండగా, బైకుతో వెంబడిస్తూ గొడవ పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు. ఇక ఈ ప్రత్యేక బృందాలు రోడ్డుపై గస్తీ తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. కాగా, పింక్ హోయ్సళ విడుదల చేసిన సురక్ష యాప్ ను వేలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారని కమాండ్ సెంటర్ పేర్కొంది.

More Telugu News