: చిన్న వయసులో తెల్లజుట్టుతో హృద్రోగాలు!

చిన్న వయసులోనే జుట్టు తెల్లగా ఉంటే.. ‘బాల మెరుపు’ అని, ‘తెలివి తేటలు ఎక్కువ’ అనే మాటలు ఇరుగుపొరుగు నుంచి వింటూ ఉంటాము. ఆ విషయాన్ని పక్కన బెడితే.. శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటమంటే హృద్రోగాలకు స్వాగతం పలకడమేనని ఆ అధ్యయనంలో వెల్లడించారు. ఈజిప్ట్ లోని యూనివర్శిటీ ఆఫ్ కైరో పరిశోధకులు సుమారు 545 మందిపై అధ్యయనం చేశారు.

ఈ అధ్యయనంలో భాగంగా.. ఆరోగ్యం, జుట్టు రంగు ఆధారంగా వారిని గ్రూపుల వారీగా విభజించారు. వారందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలనీ, ఒకే రకమైన పని చేయాలనీ సూచించారు. ఈ విధంగా పది సంవత్సరాల పాటు వారిని గమనించారు. పూర్తిగా నల్ల జుట్టు ఉన్న వారితో పోలిస్తే తెల్లజుట్టు ఉన్నవారిలో హై బీపీ, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొవ్వు పెరగడం కారణంగా హృద్రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. జుట్టు తెల్లబడే వారిలో వయసుతో పాటు వారి ధమనుల్లో చేరే కొవ్వు కూడా పెరుగుతోందని ఆ అధ్యయనంలో తేలింది.





More Telugu News