: మీ ఇంటిలో కొంత భాగం కూల్చాల్సిందే!: బాలకృష్ణకు తెలిపిన జీహెచ్ఎంసీ

పర్యావరణ ట్రైబ్యునల్ అనుమతులు వస్తే, వెంటనే జూబ్లీహిల్స్ లో ఫ్లయ్ ఓవర్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, దానికోసం బాలకృష్ణ నివాసం ఉంటున్న ఇంటిలో కొంత భాగం కూల్చి వేయాల్సి వస్తుందని జీహెచ్ఎంసీ ఇప్పటికే ఆయనకు సమాచారం ఇచ్చింది. "మీ ఇంటిలో కొంత భాగం కూల్చాల్సి వస్తుంది" అని బాలకృష్ణను సంప్రదించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాలయ్య హైదరాబాదు, జూబ్లీ హిల్స్ లోని 1355 నంబర్ గల ఇంట్లో ఉంటున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి, కేబీఆర్ పార్కు మీదుగా, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు పక్కనుంచి రోడ్ నంబర్ 45కు కలిపేలా నిర్మించే ఫ్లయ్ ఓవర్ మార్గంలో ఈ ఇల్లు ఉంది. ఇక జీహెచ్ఎంసీ నిర్ణయంపై బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి వుంది. అధికారులు మాత్రం అభివృద్ధి కోసం ఎవరైనా సహకరించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బాలయ్యకు నష్ట పరిహారాన్ని అందిస్తామని ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు.

కాగా, భాగ్యనగరిలో ఫ్లయ్ ఓవర్ల నిర్మాణాల కోసం వందలాది చెట్లను నరుకుతున్నారని కొందరు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా, పనులు నిలిపివేయాలని ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఆపై తెలంగాణ సర్కారు తన తరఫు వాదనలు వినిపిస్తూ, చెట్లను వేళ్లతో సహా పెకిలించి మరో చోటికి తరలిస్తున్నామని తెలిపింది. దీనిపై తీర్పు రిజర్వు కాగా, తమకు అనుకూలంగానే ఎన్జీటీ తీర్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. తీర్పు వెల్లడి కాగానే పనులను ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు వెల్లడించారు.

More Telugu News