: ఉరి తీసిన 21 ఏళ్లకు.. ఆ వ్యక్తిని నిర్దోషిగా తేల్చారు!

అత్యాచారం, హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్య‌క్తిని దోషిగా పేర్కొంటూ చైనాలోని ఓ న్యాయ‌స్థానం 21 ఏళ్ల క్రితం ఉరి శిక్ష విధించింది. అయితే, తాజాగా ఆ వ్య‌క్తి నిర్దోషి అని తేలింది. ఏ పాపం తెలియ‌ని త‌మ కుమారుడు నిర్దోషి అని నిరూపించే క్ర‌మంలో ఆ వ్యక్తి త‌ల్లిదండ్రులు అలుపెర‌గ‌కుండా 21ఏళ్లు పోరాడారు. నిర్దోషిని ఉరి తీసినందుకు పరిహారంగా ఆ త‌ల్లిదండ్రుల‌కు రూ. 2.5 కోట్లను అందించారు. చైనాకు చెందిన నీ శుబిన్ అనే యువ‌కుడుని హ‌త్యాచారం కేసులో 1995లో అరెస్టు చేశారు. అనంత‌రం అత‌డిని కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా మ‌ర‌ణ‌శిక్ష ప‌డింది. త‌మ కుమారుడు నిర్దోషి అని అంద‌రికీ తెలియ‌జెప్పాల‌ని అత‌డి త‌ల్లిదండ్రులు ప‌లు సార్లు పిటిష‌న్‌లు వేశారు.

అయితే, 2005లో ఈ కేసుకు సంబంధించి మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో నీ శుబిన్‌ నిర్దోషి అని తేలింది. 1995 లో పోలీసులు ఈ కేసులో ఒకరిని పట్టుకోబోయి పొర‌పాటున నీ శుబిన్‌ను ప‌ట్టుకున్న‌ట్లు తేలింది. తమ‌ కుమారుడిని ఉరి తీసినందుకు తమకు పరిహారంగా 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని నీ శుభిన్ తల్లిదండ్రులు కోరారు. అయితే, వారికి 3,88,000 డాలర్లు పరిహారంగా ఇవ్వాలని స‌ర్కారుని తాజాగా కోర్టు ఆదేశించింది.

More Telugu News