: దేశ వ్యాప్తంగా 300 కంపెనీల్లో ఈడీ సోదాలు.. అక్రమార్కుల గుండెల్లో భయం.. భయం!

షెల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవ‌లే ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆఫీసు నుంచి ఆదేశాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయా కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ ఈ రోజు పెద్ద ఎత్తున దాడులు నిర్వ‌హిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏకంగా 100 ప్రాంతాల్లో త‌నిఖీలు ప్రారంభించింది. మొత్తం 300 కంపెనీల‌పై ఒకేసారి దాడి చేస్తోంది. మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న షెల్ కంపెనీలపై ఈ దాడులు కొన‌సాగుతున్న‌ట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ దాడుల ఫ‌లితంగా అధికారులకు ఇప్ప‌టికే ప‌లు విష‌యాలు తెలిశాయి. ముంబయి ఆపరేటర్ 20 డమ్మీ డైరెక్టర్లతో 700 షెల్ కంపెనీలను న‌డిపిస్తూ రూ.46.7కోట్లను మార్చినట్టు స్ప‌ష్ట‌మైంది. ఈడీ దాడులు ప్ర‌ధానంగా కోల్ కత్తా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, చండీగ‌ఢ్‌, పాట్నా, బెంగళూరులలో కొన‌సాగుతున్నాయి. రెవెన్యూ కార్యదర్శి, కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి జాయింట్ గా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వ‌హిస్తోంది. గత మూడేళ్లలో 1155 షెల్ కంపెనీలను తొలగించార‌ని సంబంధిత అధికారి తెలిపారు. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ కంపెనీల ద్వారా 550 మంది రూ.3900 కోట్లు నగదును మనీ లాండరింగ్ చేసినట్టు స‌మాచారం. వీటిలో మ‌రిన్ని నిజాల‌ను తేల్చ‌డానికి ఈడీ దాడులు ప్రారంభించింది.

More Telugu News