: ఏపీ 'చీప్' ఇంజనీర్... కళ్లు చెదిరే ఆస్తులు... ఏసీబీ తనిఖీల్లో బయటపడుతున్న వైనం

ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ (ఆర్అండ్ బీ) చీఫ్ ఇంజనీర్ గంగాధరం అక్రమాస్తుల గుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఈ రోజు ఏసీబీకి చెందిన 20 బ‌ృందాలు ఏక కాలంలో మూడు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలకు దిగాయి. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, బెంగళూరు, హైదరాబాద్ లో గంగాధరంతోపాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు సుమారు 100 కోట్లకు పైగా అక్రమాస్తులను గంగాధరం కూడబెట్టినట్టు తెలిసింది.

విశాఖలోని ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ ఒకరి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ తో గంగాధరంకు ఉన్న సంబంధాలపైనా ఆరాతీస్తున్నారు. ప్రధానంగా విశాఖ-భీమిలి రహదారి నిర్మాణ పనుల్లో అవకతవకలకు అవకాశం కల్పించడం ద్వారా భారీగా కూడబెట్టినట్టు వచ్చిన ఆరోపణలపై అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ లోని ప్రశాంత్ నగర్ లో రూ.8 కోట్ల విల్లా కూడా గంగాధరం సమకూర్చుకున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 11 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంకా బ్యాంకు లాకర్లను కూడా తెరవాల్సి ఉంది. మరిన్ని ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News