: ఆర్కేనగర్ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు పరిశీలకులు.. ఇంతమందిని నియమించడం చరిత్రలో ఇదే తొలిసారి!

త‌మిళ‌నాడులోని ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గానికి వ‌చ్చేనెల 12న ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఎన్నిక‌ల‌ను ఆ రాష్ట్రంలోని పార్టీలు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో డ‌బ్బుతో ఓట‌ర్లకు గాలం వేస్తున్నార‌ని ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆ నియోజ‌క వ‌ర్గానికి ముగ్గురు ప‌రిశీల‌కుల‌ను పంపించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా మ‌రో ఇద్ద‌రిని పంపించింది. దేశ ఎన్నికల చరిత్రలో ఓ అసెంబ్లీ స్థానానికి ఇంతమంది పరిశీలకులను నియమించడం ఇదే మొద‌టిసారి.

ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గంలో ఓట‌ర్ల‌కు పెద్ద ఎత్తున డ‌బ్బు పంచుతూ వారిని ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని డీఎంకే, సీపీఎం తదితర పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నిక‌ల సంఘం ఐదుగురు ప‌రిశీల‌కుల‌నేగాక‌, ఎన్నిక‌ల్లో న‌గ‌దు పంపణీకి సంబంధించిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలించ‌డానికి ఈసీ.. 12 మందికి పైగా ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌ను నియ‌మించింది. అలాగే ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియ‌మించింది. ఎన్నికలు జరిగే మొత్తం 256 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను, 25 ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను, భద్రత కోసం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను ఉంచ‌నున్నారు.

More Telugu News