: డబుల్ బెడ్రూం లబ్ధిదారుతో సీఎం కేసీఆర్ ఫోన్ సంభాషణ.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన మహిళ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఓ మహిళను ఆశ్చర్యపరిచారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేశారు. ఖమ్మంలోని మద్దులపల్లిలో బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులు సామూహికంగా గృహప్రవేశాలు చేశారు. గురువారం మధ్యాహ్నం దాదాపు 12 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం లబ్ధిదారుల్లో ఒకరైన గొల్లపూడి నాగమణికి ఫోన్ చేసి ఆశ్చర్యపరిచారు. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నాగమణికి ఫోన్ వచ్చింది. తాము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, నాగమణేనా మాట్లాడేది? మీతో ముఖ్యమంత్రిగారు మాట్లాడతారట అని చెప్పడంతో ఒక్క క్షణం అవాక్కయిన ఆమె అనంతరం తేరుకుని అవునంది.

ఆ తర్వాత లైన్లోకి వచ్చిన కేసీఆర్ తాను చంద్రశేఖరరావును మాట్లాడుతున్నానని, నువ్వు ఏం పనిచేస్తావని ప్రశ్నించారు. దీనికి నాగమణి బదులిస్తూ తాము చాకలివాళ్లమని, ఊళ్లో వాళ్ల దుస్తులు ఉతుకుతుంటామని సమాధానమిచ్చింది. ఎంతవరకు చదువుకున్నావ్? ఎంతమంది పిల్లలు? అన్న ప్రశ్నకు తాను ఏడో తరగతి వరకు చదువుకున్నానని, తనకు ఇద్దరు పిల్లలని బదులిచ్చింది. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నావని కేసీఆర్ ప్రశ్నిస్తే.. తాను ఇటువంటి ఇంట్లో ఉంటానని కలలో కూడా ఊహించలేదని, అమ్మానాన్న, తోడబుట్టిన వాళ్లు వదిలేసినా మనోధైర్యంతో బతుకుతున్న తనను మీరు ఆదుకున్నారని, తాను, తన పిల్లలు, మీకు (కేసీఆర్), మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రుణపడి ఉంటామని చెప్పుకొచ్చింది. తర్వాత గ్రామాభివృద్ధి, ఒంటరి మహిళలకు పింఛన్లు తదితర వాటిపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు నాగమణి సమాధానం చెప్పింది. తర్వాత మళ్లీ కబురు చేస్తామని, అప్పుడు హైదరాబాద్ వచ్చి ఓసారి తనను కలవాలని కేసీఆర్ అనడంతో, 'తప్పకుండా వస్తా సార్' అని నాగమణి ఆనందంతో చెప్పింది.

More Telugu News