: ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి...?

ప్రతీ ఏటా తమ రాశి ఫలాలను తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందిలో ఉంటుంది. ఈ ఏడాది తమ జీవితంలో ఎటువంటి మార్పులకు అవకాశం ఉంది అన్న విషయాలను పండితులు చెబుతుంటారు. తద్వారా ముందు జాగ్రత్తలు తీసుకుని తమను తాము కాపాడుకునేందుకు రాశి ఫలితాలు అవకాశమిస్తాయి. హేవళంబి నామ సంవత్సరంలో ప్రముఖ పంచాంగకర్త తంగిరాల వేంకటకృష్ణ పూర్వ ప్రసాద సిద్ధాంతి గారు తెలియజేస్తున్న రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

మేషరాశి
అశ్విని, భరణి నక్షత్రాలు, కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి రాశి మేషం. వీరికి ఈ ఏడాది గౌరవం, మర్యాదలు 5 గా ఉంటే, అవమానం ఒకటిగా ఉంది. ఆదాయం, వ్యయం సరిసమానంగా ఉన్నాయి. అంటే ఈ ఏడాది వీరికి మంచి ఫలితాలనివ్వనుంది. కాకపోతే పై అధికారుల విషయంలో, ప్రయాణాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలన్నది పండితుల సూచన. మానసికంగా అసౌకర్యం, అప్రయత్న బదిలీలకు అవకాశం ఉంటుందట. సప్టెంబర్ వరకు పరీక్షా కాలం. తదుపరి గురుడు సప్తమ స్థానంలోకి వెళ్లడం వల్ల సానుకూల ఫలితాలుంటాయి. అవివాహితులకు వివాహ యోగం. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. సంఘంనందు, కుటుంబం నందు మంచి ఉన్నత స్థానం లభిస్తుంది. సంవత్సరం చివర్లో ఆదాయానికి లోటు ఉండదట. బాకీలు వసూలు అవుతాయి. దుర్గాస్తోత్రం పారాయణం వల్ల, హనుమాన్ చాలీసా పఠనం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

వృషభం
కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి రాశి వృషభం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 6, అవమానం 1. ఆదాయం 14గా ఉంటే వ్యయం 11 మాత్రమే. సంవత్సరం ప్రారంభంలో ఈ రాశివారికి మేలు కలుగుతుంది. విద్యారంగంలోని వారికి స్థానచలనం ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి, కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి కలసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లోని వస్తువుల కోసం అప్పులు చేస్తారు. సోదరులతో చికాకులు ఉంటాయి. గతంలో సంపాదించినది ఖర్చవుతుంది. అభివృద్ధి ఉన్నప్పటికీ ఏదో అసంతృప్తి ఉంటుంది. పెద్ద వారికి వైద్య పరమైన చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది. సరైన సమయలో స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శివస్తోత్రం, శివాష్టోత్తర పారాయణం రోజు చేయడం వల్ల, శివాలయ దర్శనం, శనివార నియమాల వల్ల దోషాల నుంచి విముక్తి ఉంటుంది.

మిధునరాశి
మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 1, 2, 3 పాదముల వారికి రాశి మిధునం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 2, వ్యయం 11గా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. ఉపాధ్యాయులు, వ్యాపారులకు అనుకూలం. ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది. గృహ నిర్మాణం తలపెడితే నిర్విఘ్నంగా జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులకు పదోన్నతి ఉంటుంది. నవంబర్ నెలలో కుటుంబ పరమైన సమస్యలు ఎదురవుతాయి. అపార్థాలకు, పంతాలు, పట్టింపులకు పోకుండా చూసుకోవాలి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఎందుకంటే ఆదాయం 2 అయితే వ్యయం 11గా ఉంది. సెప్టెంబర్ వరకు వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుర్గాస్తోత్రం, సప్తశతి పారాయణాలు, సుబ్రహ్మణ్య, దుర్గామాత ఆరాధనల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రముల వారికి రాశి కర్కాటకం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 8గా ఉన్నాయి. ఈ ఏడాది సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు అధిక శ్రమతోనే ఫలితాలు వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. కింది స్థాయి ఉద్యోగుల నుంచి ధిక్కారాలు ఎదురవుతాయి. బదిలీలకు అవకాశం. ఇష్టంలేని ప్రాంతాల్లో పోస్టింగులు ఉంటాయి. ఎంత కష్టపడినాగానీ ఫలితాలు సాధారణంగానే ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. అవివాహితులకు ఈ ఏడాది అనుకూలంగా లేదు. వ్యాపారులు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. నూనత పెట్టుబడులకు అనుకూలత లేదు. విద్యా వైజ్ఞానిక రంగాల్లోని వారిక అనేక పరీక్షలు ఎదురవుతాయి. నిలకడతో వ్యవహరిస్తే ఫలితాలు కలుగుతాయి. ప్రయత్నం చేయకపోయినా కొన్ని పనులు నెరవేరతాయి. గురువార నియమాలు, దత్తాత్రేయ ఆరాధన వల్ల కొంత ఫలితం ఉంటుంది.

సింహరాశి
మఘ, పుబ్బ నక్షత్రాలతోపాటు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటోపాదం వారికి రాశి సింహం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలకు సంవత్సరం చివర్లో ధన లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. రియల్టీ వ్యాపారంలో ఉన్నవారికి ఏడాది పొడవునా అనుకూలంగా ఉంటుంది. అధికారులకు హోదా పెరుగుతుంది. శుభ కార్యక్రమాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం, మాటసాయం ఉంటాయి. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటాయి. వ్యాపారులకు లాభాల్లేకపోయినా నష్ట సూచన లేదు. దంపతులు అవగాహనతో ఉండాలి. చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకుపోతారు. శుక్ర, మంగళవార నియమాలు, అమ్మవారి ఆరాధన ఫలితాలనిస్తాయి. తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శించడం శుభకరం.

కన్యారాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం, చిత్త 1, 2 పాదముల వారికి రాశి కన్య. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11గా ఉన్నాయి. గ్రహానుకూలతలు మిశ్రమంగా ఉంటాయి. పట్టుదలతో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మించి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు ఉంటాయి. వ్యాపారులు అందరికీ లాభకరంగా ఉంటుంది. వృత్తుల్లో ఉన్న వారు కూడా మంచిగా రాణిస్తారు. శారీరక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు ఎదురవుతాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్నేహితుల సాయంతో కష్టమైన పనులు నెరవేరతాయి. న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, తీర్థయాత్రలకు అవకాశం ఉంది. శనివార నియమాలు, శనైశ్చరునికి తైలాభిషేకాల వల్ల ఫలితం ఉంటుంది.

తులారాశి
చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదముల వారికి రాసి తుల. వీరికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నాయి. వీరికి ఏలినాటి శని పోవడం వల్ల ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. అధిక కాలయాపన, అనవసర ఖర్చులు ఉంటాయి. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. రాజకీయ వ్యవహారాలు చాకచక్యంగా నడిపిస్తారు. ధైర్యం, మానసిక ప్రశాంతతతో ఉంటారు. ప్రతీ విషయంలో ముందడుగు వేస్తారు. సంవత్సరం చివర్లో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు. వ్యాపారం కోసం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలు, అవగాహనల అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వ సంబంధ వ్యవహరాల్లో పురోగతి ఉంటుంది. మంగళ, శుక్ర, శనివార నియమాలు, దుర్గా, గణపతి స్తోత్ర పారాయణాల వల్ల యోగ్యంగా ఉంటుంది.

వృశ్చిక రాశి
విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి రాశి వృశ్చికం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నాయి. ఈ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి. కుటుంబంలో కలతలు, కలహాలకు అవకాశం ఉన్నది. అనవసర ఖర్చులు ఆర్థిక ఒత్తిళ్లకు దారితీస్తాయి. రైతులకు, విద్యార్థులకు సున్నితమైన కాలం. విద్యార్థులు ఏకాగ్రతతో వ్యవహరించాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. సంవత్సర అర్ధభాగం తర్వాత నుంచి పనుల్లో విజయం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకుల సాయం వల్ల పనుల్లో ఫలితం ఉంటుంది. ఈ రాశి వారికి ఉన్న పేరు, ప్రఖ్యాతలు కలసివస్తాయి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. శని, మంగళవార నియమాలు, అమ్మవారి పూజలతో ఫలితాలు ఉంటాయి. హనుమస్తోత్ర పారాయణం వల్ల కూడా ఫలితం లభిస్తుంది.

ధనూరాశి
మూల, పూర్వాషాడ నక్షత్రాలు, ఉత్తరాషాడం ఒకటో పాదం వారికి రాశి ధనూ. వీరికి ఈ ఏడాదిలో రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 8, వ్యయం 11గా ఉన్నాయి. చేసే ప్రతీ పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లోని వారికి అలసత్వం కారణంగా నష్టాలు వచ్చే సూచన ఉంది. రైతులు, వృత్తి పనివారికి సంవత్సరం తొలి అర్ధ భాగంలో సత్ఫలితాలు ఉంటాయి. శని జన్మరాశి సంచారం కారణంగా చేపట్టిన పనులకు విఘ్నాలు ఎదురవుతాయి. నత్తనడకన సాగడం, అనుకోని కష్ట, నష్టాలు ఎదురవుతాయి. వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. ఖర్చులు సామాన్యులను ఇబ్బందులపాలు జేస్తాయి. కొన్ని చెడు వార్తలు మనస్తాపానికి గురి చేస్తాయి. అనవసర ప్రయాణాలు, వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. సంవత్సరం రెండో భాగంలో కీర్తి, ధన వృద్ధి ఉంటాయి. ఇష్టమైన వస్తువులు సొంతం అవుతాయి. నిరంతరం ఈశ్వరారాధన, శని, శక్రవారా నియమాలు, శనైశ్చర క్షేత్ర సందర్శనాలు, తైలాభిషేకం వల్ల శుభం కలుగుతుంది.

మకరరాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణా నక్షత్రం, ధనిష్ఠ 1, 2 పాదముల వారికి రాశి మకరం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 2, అవమానం 6. ఆదాయం 11, వ్యయం 5. సెప్టెంబర్ వరకు వృత్తి, వ్యాపారాలు చక్కగా సాగుతాయి. తర్వాత ఆటంకాలుంటాయి. అకారణంగా కలహాలు, చెప్పుడు మాటల వల్ల మనస్తాపం కలుగుతాయి. విలువైన కార్యక్రమాలు, వ్యవహారాలు నిలిచిపోతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి నుంచి సాయం కోరతారు. అయిష్టంగా కొంత మందితో స్నేహం చేయాల్సి వస్తుంది. కళత్ర ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు కొన్ని సార్లు ఫలించినాగానీ ఎక్కువ సార్లు బెడిసికొడతాయి. సంవత్సరం మధ్య నుంచి వ్యాపారాల్లో లాభాలుంటాయి. సంఘంలో గౌరవం, సముచిత స్థానం లభిస్తుంది. కళారంగంలోని వారికి కలసి వస్తుంది. చిరువ్యాపారులకు వృద్ధి ఉంటుంది. రాహు, కేతువులకు జపం, దానం, హోమాలు చేయించుకోవాలి. శనైశ్చరాలయాన్ని సందర్శించుకోవాలి. నిత్యం చాలీసా పఠనం వల్ల మంచి కలుగుతుంది.

కుంభ రాశి
ధనిష్ఠా నక్షత్రం 3, 4వ పాదములు, శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదముల వారికి రాశి కుంభం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. సంవత్సరంలో మొదటి భాగం సామాన్యంగా ఉంటుంది. తర్వాత వృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రధమార్థమున కార్యభీతి, గౌరవానికి హాని, కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. స్నేహితుల కారణంగా కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు సమన్వయం వల్ల లాభాలు పొందుతారు. మొదటి ఆరు మాసాలు పరీక్ష కాలం. విద్యార్థులు క్రమశిక్షణతో సాగిపోవాలి. పై అధికారుల నుంచి అక్షింతలు పడతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లోనూ శుభకార్యక్రమాలకు అవకాశం ఉంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ద్వితీయ భాగం ప్రధమ భాగానికి భిన్నంగా ఉంటుంది. రాహు కేతువుల ఆరాధన, శివాలయ సందర్శనం, దత్తాత్రేయ ఆరాధన వల్ల ఫలితాలు కలుగుతాయి.

మీనరాశి
పూర్యాభాద్ర 4వ పాదం, ఉత్తారభాద్ర, రేవతి నక్షత్రముల వారికి రాశి మీనం. వీరికి ఈ ఏడాది రాజపూజ్యం 1, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 11గా ఉన్నాయి. సంవత్సరం అంతా కూడా సాధారణంగానే ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ప్రతికూలతలు ఎదురవుతాయి. విద్యా రంగంలోని ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, పై అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వస్తుంది. భూ సంబంధ వ్యాపారులకు పరీక్షా కాలం. రైతులకు చేతికి వచ్చిన పంట నోటిదాకా రావడం కష్టమే. చేతి వృత్తుల్లో ఉన్నవారికి లాభం. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సెప్టెంబర్ వరకు గురు సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత అష్టమ రాశి సంచారం వల్ల మానసిక ఆందోళన, ప్రతి విషయంలోనూ అనుమానం ఉంటాయి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఎదురైననూ ఫలితాలు బాగుంటాయి. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణం, గ్రామదేవతారాధన, శుక్ర, మంగళవారాల్లో లలిలా స్తోత్ర పూర్వక కుంకుమార్చన చేయించుకోవడం వల్ల దోషములు తొలగిపోతాయి.

More Telugu News