: హైదరాబాద్‌లో నెలరోజులుగా పనిచేయని 90 శాతం ఏటీఎంలు.. హోం బ్రాంచ్‌లకు పరుగులు పెడుతున్న ఖాతాదారులు!

భాగ్యనగరంలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని దాదాపు 90 శాతం ఏటీఎంలలో ‘నో క్యాష్’, ‘అవుటాఫ్ సర్వీస్’ బోర్డులు కనిపిస్తుండడంతో జనాలు బిక్కమొహం వేస్తున్నారు. డబ్బుల కోసం హోంబ్రాంచ్‌లకు పరుగులు పెడుతున్నారు. నగదు చెస్ట్‌ల నుంచి సరిపడా డబ్బులు బ్యాంకులకు చేరకపోవడమే ప్రస్తుత కష్టాలకు కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి నగదు రావడం తగ్గిపోవడంతో ఏటీఎంలలో నగదు నింపడం కష్టంగా మారిందని ఏజెన్సీలు చెబుతున్నాయి.

నగరంలో మొత్తం అన్ని బ్యాంకుల ఏటీఎంలు కలిపి 4,520 ఉండగా, వీటిలో 15 శాతం పూర్తిగా మూతపడ్డాయి. ప్రైవేటు బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. క్యాష్‌లెస్ విధానంలో భాగంగానే బ్యాంకులు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు బ్యాంక్ అసోసియేషన్ నాయకులు అంటున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడాన్ని నిలిపివేసిందని వారు ఆరోపిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రూ.100, రూ.50 నోట్లను అందుబాటులోకి తీసుకురాలేదని చెబుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 1 తర్వాత ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై పరిమితులు విధిస్తారని, ఏటీఎంలు కూడా చాలావరకు మూతపడతాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
 

More Telugu News