: తగ్గనున్న పెట్రోలు ధరలు... 50 డాలర్ల దిగువకు పడిపోయిన క్రూడాయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో క్రూడాయిల్ ధర 50 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికాలో చమురు నిల్వలు మరో 50 లక్షల బ్యారళ్లు పెరిగినట్టు ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించడంతో కొనుగోళ్లు మందగించాయని ఇంటర్ ఫాక్స్ ఎనర్జీ అనలిస్ట్ అభిషేక్ కుమార్ తెలిపారు. యూఎస్ లో ఉత్పత్తి పెరుగుతుండటంతో, పతనమవుతున్న ధరలను నిలపాలంటే, ఒపెక్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వుందని అన్నారు. కాగా, ప్రస్తుతం మేలో డెలివరీ అయ్యే బ్యారల్ క్రూడాయిల్ ధర 49.71 డాలర్లుగా ఉంది. నవంబర్ 30 తరువాత ముడి చమురు ధర ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, ఈ ప్రభావంతో భారత క్రూడ్ బాస్కెట్ ధర కూడా తగ్గనుండటంతో పెట్రోలు, డీజెల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయి.

More Telugu News