: ఆస్తి తగాదా: మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించని బంధువులు

మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు... మనిషన్నవాడు క్రమంగా పాషాణ హృదయుడైపోతున్నాడు. డబ్బు కోసం అన్నీ వదిలేస్తున్నాడు. తాజాగా ఆస్తి గొడవలతో ఓ మహిళ మృతదేహానికి దహన ‘సంస్కారం’ చేయడం మరిచిన ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన కొరిపెల్లి నరేశ్‌ రెడ్డి– సునీత (30) దంపతులు. నరేశ్‌ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుమారుడు అచ్యుత్ ను తీసుకుని సునీత పుట్టింటికి చేరింది.

ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని అత్తగారింటికి తరలించిన పుట్టింటివారు నరేశ్‌ రెడ్డికి సంబంధించిన ఆస్తిని అతడి కుమారుడు అచ్యుత్‌ పేరిట రాయాలని, సునీత అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో నరేశ్ రెడ్డి సోదరుడు తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని స్పష్టం చేసి వెళ్లిపోయాడు. అత్తింటివారు, పుట్టింటి వారు అలా ఎవరికి వారు తప్పుకోవడంతో మూడు రోజులుగా దహన సంస్కారం లేకుండా శవం నరేశ్ రెడ్డి ఇంటి వద్దే ఉంది. అచ్యుత్ ను చేరదీసిన ఇరుగు పొరుగువారు అతనికి అన్నం పెడుతున్నారు. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. 

More Telugu News