: చదువుకున్న వారంతా మాకే ఓటు వేశారు: జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. అనంత‌రం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాము అనంతపురం పట్టభద్రుల స్థానంతో పాటు నాలుగుచోట్ల గెలిచామని చెప్పారు. చదువుకున్న వారంతా తమకే ఓటు వేశారని, ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఫలితాలని అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కోట్లు ఖ‌ర్చుచేశార‌ని, ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.

ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు అన్నీ అవాస్త‌వాలే మాట్లాడుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. ఈ రోజు సభలో తాను మాట్లాడకూడదనే శాస‌న‌స‌భ‌ను రేపటికి వాయిదా వేశారని వ్యాఖ్యానించారు. గ‌తంలో ప్రారంభించి, 80 శాతం ప‌నులు పూర్తి చేసుకున్న‌ ప్రాజెక్టుల‌ను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని ఆరోపించారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడుతో పాటు ఏ ప్రాజెక్టు కూడా ఇప్ప‌టివ‌ర‌కు పూర్తి కాలేదని చెప్పారు. ఓ ప‌క్క‌ శ్రీశైలంలో నీళ్లున్నప్ప‌టికీ చంద్ర‌బాబు నాయుడు రాయలసీమకు నీళ్లివ్వలేదని జ‌గ‌న్ అన్నారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు నిజాయతీ గురించి మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. జల దినోత్సవం అంటూ శాస‌న‌సభలో చంద్రబాబు అరగంటసేపు ప్రకటన చేశారని ఆయ‌న అన్నారు. ఆ ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని, చంద్ర‌బాబు ఉద్దేశ‌పూర్వ‌కంగానే పాత అంశాలను గురించి మాట్లాడార‌ని అన్నారు.

More Telugu News