: 'మహానేత', 'దివంగత నేత', 'ప్రియతమ నేత' అనే అరిగిపోయిన రికార్డును జగన్ ఆపేయాలి: ఏపీ అసెంబ్లీ వద్ద ఎంపీ జేసీ

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు ఏపీ అసెంబ్లీలో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. మహానేత,  దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డును జగన్ ఇక ఆపేయాలంటూ ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను జగన్ 2014 ఎన్నికల్లోనే వాడేశారని... ఇంకా ఆయన పేరును పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని చురక అంటించారు.

కొత్త హామీలతో ముందుకొస్తేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని... లేకపోతే అధికారాన్ని చేజిక్కించుకోవడం అసాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తికి లోకేష్ ఎలా వారసుడో... అలాగే ఆయన రాజకీయానికి కూడా వారసుడేనని... అందులో తప్పేముందని జేసీ అన్నారు. ఎమ్మెల్సీగా లోకేష్ గెలుపొందడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అన్నారు. 

More Telugu News