: మదర్ థెరిసా నుంచి షారుక్ ఖాన్ వరకూ... అందరిపైనా వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు.. ఆదిత్యనాథ్!

ఉత్తరప్రదేశ్ పై సస్పెన్స్ వీడింది. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన బలమైన మద్దతు ఓ వైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్ షాల తరువాత స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా కలియదిరిగి, 300 సీట్లకు పైగా సాధించేందుకు తన వంతు కృషి చేసిన గోరక్ నాథ్ మఠాధిపతి, హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు ఆదిత్యనాథ్, నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, మోదీ సహా పలువురు బీజేపీ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కరుడుగట్టిన హిందూ అతివాదిగా పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్, ఎన్నో మార్లు పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

1998లో గోరఖ్ పూర్ ఎంపీగా గెలిచిన ఆయన, 26 ఏళ్ల వయసులో పార్లమెంటులో అడుగుపెట్టి, అప్పటి సభలో అతి తక్కువ వయసువాడిగా నిలిచారు. "హిందువులను క్రిస్టియన్లుగా మార్చేందుకే మదర్‌ థెరీసా భారత్‌కు వచ్చారు" అని మదర్ థెరీసాపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. మరోసారి, "షారుక్‌ ఖాన్‌, పాక్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ భాషలో మాట్లాడుతున్నారు. ఆయన సినిమాలను ప్రజలు చూడకపోతే రోడ్డున పడతాడు" అని అన్నారు. యూపీని, భారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చేంతవరకూ విశ్రమించేది లేదని 2005లో 'ఘర్‌ వాపసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అన్నారు.

హిందువులపై ఏ చిన్న దాడి జరిగినా, తన అనుచరులతో కలసి అక్కడికి వెళ్లే ఆదిత్య నాథ్, కొంతకాలం జైల్లో కూడా ఉన్నారు. ఆదిత్యపై హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసులు పెండింగుల్లో ఉన్నాయి. ముస్లిం శ్మశానవాటికల్లోకి దూసుకెళ్లడం, అల్లర్లను రెచ్చగొట్టడం, ప్రజల ప్రాణాలకు ముప్పు కల్పించడం వంటి ఎన్నో అభియోగాలు ఆయనపై ఉన్నాయి. ఎన్నోమార్లు బీజేపీ విప్ ను ధిక్కరించిన చరిత్ర కూడా ఆదిత్యనాథ్ కు ఉంది. బీజేపీకి తన అవసరం ఉందిగానీ, పార్టీ అవసరం తనకు లేదనే ధోరణిలో ఉండే ఆయన, ఇప్పుడు సీఎం పీఠంపై ఉండటం, మరే పార్టీ దగ్గర్లో కూడా లేకపోవడంతో, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని, సంఘ్ పరివార్ నేతలు బలంగా చెబుతుండటం గమనార్హం.

More Telugu News