: జయలలిత కుమారుడినంటూ పిటిషన్ వేసిన వ్యక్తిపై హైకోర్టు ఆగ్రహం!

తాను దివంగత ముఖ్యమంత్రి జయలలిత, నటుడు శోభన్ బాబులకు జన్మించానని... జయ ఆస్తులకు తానే వారసుడినని ఈరోడ్ కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. శశికళ నుంచి తన ప్రాణాలకు హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కూడా అతను కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ మహదేవన్ ఫిర్యాదుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిర్యాదుదారుడు సమర్పించిన డాక్యుమెంట్లను ఎల్ కేజీ విద్యార్థి ముందు ఉంచినా... అవి తప్పుడు డాక్యుమెంట్లు అనే విషయాన్ని చెబుతాడని... అందుబాటులో ఉన్న ప్రముఖుల ఫొటోలను డాక్యుమెంట్లపై అతికించాడని అన్నారు. ఫిర్యాదుదారుడిని శనివారంనాడు చెన్నై పోలీస్ కమిషనర్ ముందు హాజరుపరిచి, ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. కృష్ణమూర్తికి మద్దతుగా కోర్టుకు వచ్చిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామిని కూడా ఆయన మందలించారు. ఈ వ్యవహారంలో మీ పాత్ర ఏమిటని ప్రశ్నించారు.

హైకోర్టులో వేసిన పిటిషన్ లో 1985లో జయలలిత, శోభన్ బాబులకు తాను జన్మించానని కృష్ణమూర్తి పేర్కొన్నాడు. ఈరోడ్ కు చెందిన వసంతమణికి తనను దత్తత ఇచ్చారని... దత్తత పత్రంపై జయలలిత, శోభన్ బాబు, వసంతమణి ఫొటోలు, సంతకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాదు, సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సంతకం చేశారని పేర్కొన్నారు.

More Telugu News