: మూడు గంటలకు పైబడి టీవి చూసే పిల్లలకు ‘డయాబెటిస్’ ప్రమాదం!

తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు మూడు గంటలకు పైబడి టీవి చూస్తే కనుక ‘డయాబెటిస్’ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఆన్ లైన్ జర్నల్ ‘ఆర్చివ్స్’ లోని ‘డిసీజ్ ఇన్ చైల్డ్ హుడ్’లో వెల్లడించారు. కేవలం, టీవీలే కాకుండా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకు గంటల తరబడి అతుక్కుపోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రోజూ మూడు గంటల కంటే ఎక్కువ సమయం తాము టీవీ చూస్తుంటామని ఐదుగురు పిల్లల్లో ఒకరు అంటే 18 శాతం పేర్కొన్నట్లు ఆ రీసెర్చిలో తెలిసింది.

ఈ పరిశోధన ప్రకారం, తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను వినియోగించే సమయాన్ని తగ్గించుకుంటే కనుక టైప్-2 డయాబెటీస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. ప్రస్తుతం, టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువగా గడుపుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందని, దీని ప్రభావం అనంతర జీవితంపై పడుతుందన్నారు. లండన్ లోని బర్మింగ్ హామ్, లిసెస్టర్ లో ని రెండు వందల ప్రాథమిక పాఠశాలల్లో  9-10 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 4,500 మంది పిల్లలపై సర్వే నిర్వహించామని చెప్పారు.

ఆ విద్యార్థుల్లో మెటాబాలిక్, కార్డియోవాస్క్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కు సంబంధించి నిర్వహించిన ఈ సర్వేలో రక్తంలో కొవ్వు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ .. బీపీ, శరీరంలో కొవ్వుకు సంబంధించి ఆ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. రోజుకు మూడు గంటలకు పైబడి టీవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు వినియోగించే పిల్లల్లో బీపీ, బాడీ ఫ్యాట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్.. స్థాయులు అత్యధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అబ్బాయిల్లో 22 శాతం, అమ్మాయిల్లో 14 శాతం మంది తాము రోజూ మూడు గంటలకు పైబడి టీవీ, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల ముందు గడుపుతామని చెప్పారు. వీటి ముందు గంటల తరబడి గడపడం కారణంగా లెప్టిన్ హార్మోన్ స్థాయుల్లో మార్పులు సంభవించడంతో దాని ప్రభావం ఆకలి, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇన్స్ లిన్ రెసిస్టెన్స్ లపై పడుతుందని పరిశోధకులు వెల్లడించారు.

More Telugu News