: ఎస్‌సీవోలో చేరాక భారత్, పాక్ మధ్య మైత్రి వికసిస్తుంది: చైనా

సరిహద్దు తగాదాల పరిష్కారం, తీవ్రవాద నిర్మూలన కోసం కృషి చేసే షాంఘై కో-ఆపరేటీవ్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో)లో ఈ ఏడాది జూన్‌లో భార‌త్, పాకిస్థాన్ స‌భ్య‌త్వం పొంద‌నున్నాయి. ఈ అంశంపై చైనా అధికార పత్రిక ఓ క‌థ‌నం ప్ర‌చురిస్తూ ఎస్‌సీవోలో చేరిన అనంత‌రం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణం వికసిస్తుందని పేర్కొంది. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరిగి పరస్పర సహకార భావం పెంపొందుతుందని తెలిపింది. ఈ ఆర్గ‌నైజేష‌న్‌ చైనా రాజధాని బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తుంది. అందులో ఇప్ప‌టికే చైనా, రష్యా, కిర్గిస్తాన్‌, కజక్‌స్తాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్ దేశాలు వ్యవస్థాపక సభ్య దేశాలుగా ఉన్నాయి, ఇక భార‌త్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌, బెలారస్‌, భారత్‌, ఇరాన్‌, మంగోలియా, పాకిస్థాన్ దేశాలు పరిశీలక దేశాలుగా ఉన్నాయి.

రెండేళ్ల క్రితం రష్యాలో జరిగిన ఓ సమావేశంలో భారత్‌, పాక్‌ లను కూడా ఈ కూటమిలో చేర్చుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని తీర్మానం చేశారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో కజకిస్తాన్‌ రాజధాని ఆస్తానాలో జరిగే సమావేశంలో ఇరు దేశాలు ఆ ఆర్గ‌నైజేష‌న్‌ స‌భ్య‌దేశాలుగా మార‌నున్నాయి. స‌భ్య‌దేశాలు ఎస్‌సీవోకి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. సభ్య దేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మరో సభ్య దేశం మధ్యవర్తిగా వ్యవహరించి ఇరు దేశాల మ‌ధ్య పరిస్థితిని చక్కదిద్దుతుంది.

More Telugu News