: కేంద్రం సంగతేంటో ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్ఎస్ఎల్పీలో విలేకరుల సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 వరకు మోదీ హవా ఉంటుందని గ్యారెంటీ లేదని, ఏమైనా జరగొచ్చన్న కేటీఆర్, ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదన్నారు. తెలంగాణపై బీజేపీ ఒక్కటే కాదని, ఎవరైనా ఫోకస్ చేసుకోవచ్చన్నారు. అయితే 2019లో మాత్రం టీఆర్ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ ఉన్నంతకాలం కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి తప్పదన్న కేటీఆర్, కాంగ్రెస్‌ను ఎవరూ నాశనం చేయలేరని, ఆ అవకాశం ఆ పార్టీ నేతలు ఇతరులకు ఇవ్వబోరని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని, కేంద్రంలో చేరిన వారికి నిధులేమైనా వస్తున్నాయా? అని ప్రశ్నించారు.

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి సామర్థ్యం ఉన్న నాయకుడు ఐదారు కిలోమీటర్ల దూరంలో కూడా లేడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీలో పోటీ చేసే నాయకులే లేరని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పెంపు కచ్చితంగా జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తమకు ఎవరితోనూ పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. రాష్ట్రంలో కొత్త పార్టీలు ఆవిర్భవించే అవకాశాలున్నాయన్న కేటీఆర్.. పార్టీలు ఎవరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

More Telugu News