: యూపీలో బీజేపీ ఎందుకు గెలుస్తుందో చెప్పిన లగడపాటి

ఎన్నికల సర్వేల్లో కచ్చితమైన జోస్యం చెప్పే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 'ఫ్లాష్ టీం' ఈసారి ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లోనూ సర్వే నిర్వహించింది. యూపీలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ ఒక్కటైనా బీజేపీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. సీఎం అఖిలేశ్‌కు వివాద రహితుడిగా పేరున్నా పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అలాగే కాంగ్రెస్‌తో కలవడంతోపాటు ఆ పార్టీకి వందకు పైగా సీట్లివ్వడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు ఓ కారణమన్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో చాలామందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గురించి తెలిసినా అఖిలేశ్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎస్పీ తరపున బరిలోకి దిగిన 225 మందిలో 120 మందికి పరాభవం తప్పదని రాజ్‌గోపాల్ జోస్యం చెప్పారు.


 ఇక యూపీలో బీజేపీ గద్దెనెక్కడం ఖాయమని చెప్పిన రాజ్‌గోపాల్ మోదీ విస్తృత ప్రచారమే బీజేపీని గట్టెక్కించనుందని తెలిపారు. హిందూ ఓట్ల ఏకీకరణకు మోదీ ప్రసంగాలు బాగా పనిచేశాయన్నారు. రంజాన్ నాడు నిరంతరంగా విద్యుత్ ఇచ్చే అఖిలేశ్ దీపావళి రోజున ఇవ్వడం లేదని, ముస్లింల  ఖబరస్థాన్ కోసం స్థలాలు ఇచ్చే ఎస్పీ ప్రభుత్వం హిందువులను విస్మరించిందన్న మోదీ ప్రచారం తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే అందరికంటే ముందుగా మోదీ చేసిన సన్నకారు రైతుల రుణాలు మాఫీ ప్రకటన బాగా పనిచేసిందన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు.

ఇక పంజాబ్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని లగడపాటి ఫ్లాష్ టీం వెల్లడించింది. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని లగడపాటి అంచనా వేశారు. కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని, సిద్ధూ చేరిక కాంగ్రెస్‌కు కలిసొస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి వచ్చేది 4-5 సీట్లు మాత్రమేనని వివరించారు.
 
 

More Telugu News