: కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లో ఆరితేరిన బాలిక.. ‘సాఫ్ట్ వేర్’ కంపెనీ ప్రారంభించింది!

కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లో ఆరితేరిన ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన పద మూడేళ్ల బాలిక ఇసబెల్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇసబెల్ కు మొదటి నుంచి గణితం అంటే చాలా ఇష్టం. దీంతో, ఆ సబ్జెక్టులో బాగా రాణిస్తుండేది. ఇసబెల్ లో ప్రతిభను గుర్తించిన ఆమె టీచర్, కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోమని ఆమెను ప్రోత్సహించింది. ఇసబెల్ తల్లి కూడా ఆమెను ప్రోత్సహించింది. కూతురుకి ప్రత్యేకమైన ట్యూషన్స్ పెట్టించింది.

దీంతో, పదేళ్ల వయసులో ఉన్నపుడే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడానికి ఇసబెల్ శ్రీకారం చుట్టింది. ఆన్ లైన్ ద్వారా హెచ్ టీఎంఎల్, జావా స్క్రిప్ట్ లను నేర్చుకున్న ఇసబెల్, తన పదమూడవ యేటకే కంప్యూటర్ కోడింగ్, ప్రోగ్రామింగ్ లో ఆరితేరిపోయింది. అంతేకాకుండా, తన లాగే చిన్నతనంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే అమ్మాయిలకు చేయూత నివ్వాలని భావించింది. ‘గర్ల్స్ విల్ కోడ్’ అనే పేరుతో ఓ సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించింది. ఈ సంస్థను స్థాపించింది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కాదని, ఆసక్తి కనబర్చే వారికి తర్ఫీదు నిచ్చేందుకని ఇసబెల్ పేర్కొంది. పాఠశాలల్లో వారి తరగతులు పూర్తయ్యాక, విద్యార్థినులకు కంప్యూటర్ కోడింగ్ కోర్సును బోధిస్తున్నామని, వారితో కథలు, గేమ్స్ రూపొందిస్తున్నట్లు ఇసబెల్ చెప్పింది.

More Telugu News