: ఏపీ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు.. ఒక టీచర్ బోధిస్తే 70 స్కూళ్ల పిల్లలు వినొచ్చు!

ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. హైటెక్ హంగులు సంతరించుకోనున్నాయి. ‘స్మార్ట్‌బోర్డ్ టెక్నాలజీ’ సాయంతో ‘వర్చువల్’  క్లాస్‌రూం బోధనకు రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడు బోధించే పాఠాలను ఒకేసారి 70 స్కూళ్లలోని విద్యార్థులు వినొచ్చు. ఒక్క ఆడియోనే కాకుండా వీడియో కూడా ఉంటుంది. అంతేకాదు ఎక్కడ ఎవరికి ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే ఉపాధ్యాయుడిని అడిగి అప్పటికప్పుడే నివృత్తి కూడా చేసుకోవచ్చు.

తొలి దశలో నాలుగు జిల్లాల్లోని ‘డైట్స్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 280 స్కూళ్లలో ‘వర్చువల్’ క్లాస్‌రూం బోధనను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విశాఖపట్టణం, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి శిక్షణ ఇచ్చారు. ఇక ఒక్కో వర్చువల్ క్లాస్ రూం ఏర్పాటుకు రూ.3.5 నుంచి రూ.4.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. అయితే రికరింగ్ వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో వర్చువల్ క్లాస్ రూం బోధనకు కేంద్రం అనుమతి ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి.

 
 
 
 

More Telugu News