: జగన్ కౌంటర్.. టీడీపీ నేతల ఎన్‌కౌంటర్.. ఏపీ అసెంబ్లీలో లెక్కల గోల!

ఏపీ అసెంబ్లీ మంగళవారం లెక్కల గోలతో హోరెత్తిపోయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాలంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జగన్ ప్రసంగానికి పలువురు మంత్రులు అడ్డుతగిలారు. ముఖ్యమైన మంత్రులందరూ ఏదో ఒక సమయంలో జగన్‌ కౌంటర్‌కు రిప్లై ఇచ్చారు. తన ప్రసంగానికి మంత్రులు అడుగడుగునా అడ్డు తగులుతుండడంతో ఒక దశలో జగన్ అసహనం వ్యక్తం చేశారు.

తునిలో పరిశ్రమల గురించి జగన్ లేవనెత్తినప్పుడు డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పందించారు. జగన్ తూర్పుగోదావరిలో పర్యటించినప్పుడు పరిశ్రమలు వద్దని ఆందోళన చేశారని, పశ్చిమగోదావరి జిల్లా వెళ్లినప్పుడు పరిశ్రమలు కావాలంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంలో 'బీకాంలో ఫిజిక్స్ చదివిని వాళ్లకు తన లెక్కలు అర్థం కావ'ని జగన్ అన్నప్పుడు మంత్రి యనమల జోక్యం చేసుకున్నారు.

స్కూలుకు కానీ, కాలేజీకి కానీ వెళ్లకుండానే జగన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక నిల్వ సామర్థ్యం లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారన్న జగన్ వ్యాఖ్యలకు దేవినేని ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై పల్లె రఘునాథరెడ్డి స్పందించారు. జగన్ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ కనీస పరిజ్ఞానం లేకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు.

More Telugu News