: స్టీవ్ స్మిత్ వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసిన కోహ్లీ

ఆస్ట్రేలియా కెప్టెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...స్మిత్ పై రిఫరీకి ఫిర్యాదు చేశాడు. స్మిత్ లక్ష్మణ రేఖ దాటాడని ఆరోపించాడు. బాధ్యతలు నిర్వర్తించాల్సిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరించాడని ఆరోపించాడు. కాగా, ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. టీమిండియా ఫీల్డర్లు అప్పీల్ చేయగానే అంపైర్ అవుట్ అంటూ ప్రకటించాడు. తన ఎల్బీడబ్ల్యూపై ఏదైనా అనుమానం ఉంటే డీఆర్ఎస్ విధానంలో రివ్యూకు వెళ్లవచ్చు. అంపైర్ అవుట్ అని ప్రకటించగానే స్మిత్ రివ్యూ కోరలేదు... నెమ్మదిగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న కోంబ్ వద్దకు వెళ్లాడు. అతనిని ఆరాతీశాడు. అతను అనుమానం వ్యక్తం చేయడంతో ఏం చేయాలంటూ పెవిలియన్ వైపు చూశాడు.

దీనికి కనీసం రెండు నిమిషాల సమయం తీసుకుంది. ఈ లోపు స్మిత్ అవుటయ్యాడని సంబరాలు చేసుకున్న కోహ్లీ...స్మిత్ క్రీజు నుంచి కదలకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరుగుతోంది? అంటూ అంపైర్ ను ప్రశ్నించాడు. దీంతో పరుగెత్తుకెళ్లిన అంపైర్ స్మిత్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో వివాదం సద్దుమణిగినప్పటికీ...స్మిత్ వ్యవహార శైలి సరైనది కాదని, ఫీల్డ్ లో అంపైర్ కు ఆటగాడు గౌరవమివ్వాలని స్పష్టం చేస్తూ స్మిత్ పై రిఫరీకి ఫిర్యాదు చేశాడు. దీంతో స్మిత్ పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News