: పెళ్లయిన యువతులకు రెసిడెన్షియల్ కాలేజీల్లో నో అడ్మిషన్.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ!

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. రెసిడెన్షియల్ కళాశాలలు అందిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందే యువతులు అవివాహితులై ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం కొత్తగా చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లయిన అమ్మాయిలు హాస్టల్ లో ఉండి చదువుకుంటుంటే, అక్కడికి వారి భర్తలు తరచూ వస్తారని, దీంతో మిగతా అమ్మాయిలకు ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతూ, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి కేవలం అవివాహిత యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ వెలువరించింది.

కాగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో సుమారు 4 వేల మంది చదువుతున్నారు. మొత్తం 23 డిగ్రీ కళాశాలలు ఉండగా, ఒక్కో కాలేజీలో 280 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి విద్య నుంచి భోజనం వరకూ అన్నీ ఉచితమే. 70 శాతం సీట్లను ఎస్సీలకు, మిగిలిన 25 శాతం సీట్లను ఎస్టీ, బీసీ, సాధారణ కేటగిరీల్లో అందిస్తుంటారు. ఇక కొత్త విద్యా సంవత్సరంలో బీఏ, బీకామ్, బీఎస్ఈ తొలి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న వేళ, ఈ కొత్త నిబంధన వచ్చి చేరింది.

ప్రతి వారమూ పెళ్లయిన వారి భర్తలు వచ్చి వెళుతుంటే, ఇతర అమ్మాయిలకు ఇబ్బందేనని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ మేనేజర్ బీ వెంకటరాజు వెల్లడించారు. తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం అమ్మాయిలకు శరాఘాతమని ప్రోగ్రసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ నాయకురాలు వీ సంధ్య ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News