: ఇప్పుడేం చేయలేం... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన తప్పు కూడా ఉంది: వాసవీ ఉదంతంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి

హైదరాబాదులోని శ్రీవాసవీ కాలేజ్ ఉదంతంపై స్పందించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, ఈ తప్పిదంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని అన్నారు. మిగతా కాలేజీల విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవుతున్న వేళ, తమ పిల్లలు ఎందుకు వెళ్లడం లేదని ఒక్కసారి ఆలోచించినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు సైతం తామెందుకు ప్రాక్టికల్స్ కు వెళ్లలేకపోయామని ఆలోచించలేదని తెలిపారు.

ఈ విషయంలో తమకు ఎంతమాత్రమూ సమాచారం లేదని, ఒక్క విద్యార్థి పేరెంట్ అయినా, ప్రాక్టికల్స్ పరీక్షలప్పుడే విషయం తమ దృష్టికి తీసుకు వచ్చివుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. ఇప్పుడిక చేయగలిగింది ఏమీ లేదని, ప్రాక్టికల్స్ కు వెళ్లలేదు కాబట్టి, విద్యార్థులు పరీక్ష తప్పినట్టుగానే రిజల్ట్స్ లో వస్తుంది కాబట్టి, సప్లిమెంటరీకి చక్కగా ప్రిపేర్ కావాలని, ప్రభుత్వ పాఠశాల నుంచి వారు పరీక్షలకు ఫీజులు కట్టే అవకాశాన్ని కల్పిస్తామని అశోక్ తెలిపారు.

More Telugu News