: 110 కోట్ల ఒప్పందం చేసుకున్న తొలి భారతీయ క్రీడాకారుడు కోహ్లీ!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో మాత్రమే కాదు, భారీ ఎండార్స్ మెంట్లు అందుకోవడంలో కూడా మంచి ఫాంలో ఉన్నాడు. భారీ ఒప్పందాలతో కోహ్లీ దూసుకుపోతున్నాడు. ఫిట్ నెస్ లో తిరుగులేదని వెటరన్ లు, సహచరుల నుంచి కితాబులందుకొంటున్న కోహ్లీ...జర్మన్ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్యూమాతో భారీ ఒప్పందం చేసుకున్నాడు. ఇంత పెద్ద ఒప్పందాన్ని గతంలో ఏ భారతీయ క్రీడాకారుడు ఈ సంస్థతో చేసుకోకపోవడం విశేషం. ఈ ఒప్పందం కింద ఎనిమిదేళ్ల కాలానికి 110 కోట్ల రూపాయలను ప్యూమా కోహ్లీకి అందజేయనుంది. దీంతో కోహ్లీ ఆ బ్రాండ్ కు గ్లోబల్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు.

 ప్యూమాకు ప్రపంచ ప్రఖ్యాత జమైకా చిరుతగా పేరొందిన పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్, అమెరికా స్ప్రింటర్ అసాఫా పావెల్, దిగ్గజ ఫుట్‌ బాల్ క్రీడాకారులు థీర్రి హెన్రీ, అలివర్ గిరౌడ్‌ కూడా ఈ సంస్థ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లు. తమ తమ క్రీడల్లో దిగ్గజాలైన వారితో బ్రాండింగ్ పొందడం గర్వంగా ఉందని కోహ్లీ పేర్కొన్నారు. 2013లో 10 కోట్ల రూపాయలకు కోహ్లీ అడిడాస్ తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ముగియడంతో ఎనిమిదేళ్లకు కోహ్లీ ప్యూమాతో కొనసాగనున్నాడు. అంటే ఇంచుమించు తన కెరీర్ మొత్తం కోహ్లీ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగనున్నాడు. 

More Telugu News